మేము రాం....
- పీసీసీ చీఫ్‌ను లెక్కచేయని నేతలు
- రెండో రోజు జరిగిన సమీక్షలు
- బలరాం, రెడ్యా, వీరయ్య, కవిత గైర్హాజరు
- నిన్న సారయ్య, రాజయ్య, దుగ్యాల డుమ్మా..
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత జిల్లాలోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ సమీక్షలకు జిల్లాలోని నేతలే వెళ్లడం లేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పొన్నాలతో సన్నిహితంగా ఉన్న పలువురు నేతలు సైతం ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.
ఎన్నికల్లో ఓటమిపై పొన్నాల లక్ష్మయ్య నిర్వహిస్తున్న సమీక్షలను పలువురు నేతలు అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్ష శుక్రవారం నిర్వహించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే డీ.ఎస్.రెడ్యానాయక్, ములుగు అభ్యర్థి పొదెం వీరయ్య, మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవిత.. సమీక్షలకు వెళ్లలేదు. ముఖ్య నేతలు వెళ్లకపోవడంతో డోర్నకల్, ములుగు నియోజకవర్గాలపై సమీక్ష జరగలేదు. మహబూబాబాద్ మాజీ ఎంపీ బలరాంనాయక్ సైతం ఈ భేటీలకు హాజరు కాలేదు. పొన్నాల నాయకత్వం విషయంలో కాంగ్రెస్‌లో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలోనే జిల్లా ముఖ్య నేతలు ఈ భేటీలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.
గురువారం జరిగిన నియోజకవర్గ సమీక్షల్లోనూ ఇదే జరిగింది. పొన్నాలతో మొదటి నుంచీ దూరంగా ఉండే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య వెళ్లకపోవడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గ సమీక్ష జరగలేదు. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దుగ్యాల శ్రీనివాసరావు సైతం సమీక్షలకు దూరంగానే ఉన్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించకుండా.. ఏదో సమీక్షలు జరిపామని చెప్పుకోవడానికి పొన్నాల ప్రయత్నిస్తున్నారని, అందుకే తాము వెళ్లలేదని ఎన్నికల్లో ఓడిపోయిన జిల్లా ముఖ్య నేతలు వ్యాఖ్యానించారు. జిల్లా ముఖ్యనేతలు సమీక్షలకు గైర్హాజరు కావడంతో పొన్నాల మద్దతుదారులకు ఇబ్బందిగా మారింది. సమీక్షలు జరగని నియోజకవర్గాలపై కూడా త్వరలోనే భేటీ నిర్ణయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం సమీక్ష సుదీర్ఘంగా జరిగింది. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి వెంకటస్వామి సహా 20 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. ‘కాంగ్రెస్ మండల స్థాయి నేతలు, ఇతర నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ఉంటున్నారు. దొంతి మాధవరెడ్డి విషయంపై స్పష్టత ఇవ్వండి. ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నారా లేదా... చెప్పండి’ అని పలువురు నేతలు పీసీసీ చీఫ్ పొన్నాలను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు పొన్నాల నుంచి సమాధానం రాలేదు. ‘కత్తి వెంకటస్వామి ఇంచార్జిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న మీరు పార్టీ కోసం పని చేయండి. త్వరలో కొత్త కమిటీలు నియమిస్తాం’ అని చెప్పి పొన్నాల విషయాన్ని దాటవేశారు. పార్టీ ఓటమిపై ఈ భేటీలో పెద్దగా చర్చ జరగలేదు.
మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షకు.. ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేసిన మాలోత్ కవిత హాజరు కాలేదు. పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చంద్రారెడ్డి, జిల్లాపరిషత్ ఫ్లోర్ లీడర్ ఎం.వెంకన్న, పలువురు నేతలు హాజరయ్యారు. సొంత పార్టీ నేతల తీరుతోనే ఓడిపోయామని చెప్పారు. పీసీసీ కార్యదర్శులు వి.రాజవర్ధన్‌రెడ్డి, శ్రీరాంభద్రయ్య, నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాంభరత్‌లు పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ‘ఎన్నికల ముందే వీరు టీఆర్‌ఎస్ నాయకులతో కలిసిపోయారు. వీరిపై చర్యలు తీసుకోకుండా పార్టీ బాధ్యతలు అప్పగించారు. నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు టీఆర్‌ఎస్ కండువా కప్పుకుని తిరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకోండి’ అని ఫిర్యాదు చేశారు.
డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష జరగలేదు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ సహా పార్టీ నేతలు ఎవరూ వెళ్లకపోవడంతో సమీక్ష జరగలేదు. ముందుగా నిర్ణయించిన మేరకు డోర్నకల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉన్నందున తాను హాజరు కాలేకపోయానని రెడ్యానాయక్ తెలిపారు.
ములుగు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష జరగలేదు. మాజీ ఎమ్మెల్యే, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య సమావేశానికి హాజరు కాలేదు. నియోజకవర్గానికి చెందిన పార్టీ ఇతర నేతలు సైతం ఆ భేటీకి వెళ్లలేదు.