- అధినేత ప్రకటించినా సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ తారుమారు
- నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంస్థాగత సంస్కరణలతోపాటు, ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా, సొంత పార్టీ వ్యవహారాలను ఇంకా చక్కబెట్టలేకపోయారు. ఫిబ్రవరిలో ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించినా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం కార్యకర్తలకే ఉంటుందని పార్టీ నాయకత్వం పలుమార్లు పేర్కొన్నా ఆదిశగా వారి సేవలను వినియోగించుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ యే కాకుండా, చివరకు పార్టీ పదవులకు కూడా దిక్కులేకుండా పోయిందన్న అసంతృప్తి పా ర్టీ వర్గాల్లోని అన్ని స్థాయిల్లో గూడుకట్టుకుంది.
టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండుసార్లు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. ఫిబ్రవరి 3న ప్రారంభమైన సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆ నెల 20వ తేదీ వరకు కొనసాగింది. కానీ, ఇప్పటికీ ఎంత సభ్యత్వం నమోదయిందో పార్టీ నాయకత్వం నుంచి ప్రకటనే వెలువడలేదు. సభ్యత్వ నమోదు వ్యవహరాలను పర్యవేక్షించడానికి నియమించిన అడహాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శాసనమండలి ఎన్నికల్లో ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ఈలోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.
సీఎం అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సోమవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం జరగనుంది. ప్రధానంగా సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలు, మండలి ఎన్నికలు, పార్టీ సభ్యులకు బీమా సౌకర్యం తదితర అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసన మండలికి ఎన్నికలు జరుగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్, అడహక్‌కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించుకోవడం పార్టీ ముందున్న అతి పెద్ద సవాలు.
ఒక్క ప్రతి కూల ఫలితం వచ్చినా, అది ప్రభుత్వ పాల నకు రెఫరెండంగా ప్రచారం చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలూ జరగనున్నాయి. ఏప్రిల్ 24న పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక, 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మరో సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను సీఎం ప్రకటించే అవకాశం ఉంది.