కుటుంబ పాలనను అంతం చేయండి | Make it a family rule to end | Sakshi
Sakshi News home page

కుటుంబ పాలనను అంతం చేయండి

Published Sun, Aug 31 2014 11:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కుటుంబ పాలనను అంతం చేయండి - Sakshi

కుటుంబ పాలనను అంతం చేయండి

రామచంద్రాపురం: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ, టీడీపీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జగ్గారెడ్డి మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఎదిగి బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ఎప్పుడు ముందుంటే మనస్తత్వం ఆయనదన్నారు.
 
ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించి మెదక్ జిల్లా నుంచే టీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే నీటి సమస్య, విద్యుత్ సమస్య ఉండదని చెప్పిన ఆయన ఇప్పుడు చేస్తుందేంటని ప్రశ్నించారు.

ఈ సమస్యపై ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సచివాలయానికి పరిమితమై ఆదేశాలివ్వడానికే సరిపోతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్ పార్టీతో ఇప్పుడు కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తూర్పు జయప్రకాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని అది ఆయన హోదాకు తగదన్నారు.
 
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్‌కుమార్‌గౌడ్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, విశ్వనాథం, రవీందర్, గిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 
మునిపల్లి: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అందోల్ నియోజకవర్గ కన్వీనర్ ఎల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కంకోల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న జగ్గారెడ్డిని చూసి టీఆర్‌ఎస్ ఆందోళనకు గురవుతోందని తెలిపారు. రాష్ర్టం విడిపోయిన తర్వాత కూడా ఆయనపై విమర్శలు చేయడం టీఆర్‌ఎస్ నాయకులకు సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతి పక్ష పార్టీలను విమర్శించడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు.
 
ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధికి పాటుపడాలే తప్ప ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం తగదని హితవు పలికారు. జగ్గారెడ్డి బరిలో ఉండటం వల్ల తమ అభ్యర్థి ఎక్కడ ఓడిపోతాడోననే భయం.. టీఆర్‌ఎస్ మంత్రులకు కునుకు లేకుండా చేస్తోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగ్గారెడ్డి గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.  
 
జగ్గారెడ్డి గెలుపు ఖాయం

జిన్నారం: మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ.. పార్టీ గెలుపునకు ప్రతిఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. జగ్గారెడ్డి గెలుపునకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరారు. వీరిని రామచంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు.  పార్టీ నాయకు లు అంజరెడ్డి, విష్ణువర్ధణ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి  పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement