chintala rama chandra reddy
-
Hyderabad: జెండావిష్కరణలో బీజేపీ నేతల బాహాబాహీ
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ విషయంపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ భర్త గడ్డం రామన్‌గౌడ్ కార్యకర్తల ఎదుట బాహాబాహీకి దిగారు. హిమాయత్‌నగర్ డివిజన్లోని విఠల్‌వాడీలో బీజేపీ కార్యకర్త అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇరు వర్గీయులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణకు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్‌కు ఆహ్వానం అందింది. మొదట చింతల రాగా, 20 నిమిషాల పాటు కార్పొరేటర్ కోసం వేచి ఉండగా ఆమె రావడం ఆలస్యమైంది. దీంతో చింతల జెండాను ఆవిష్కరించి వెనుదిరిగారు. ఇదే సమయంలో కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ ఆమె భర్త రామన్‌గౌడ్ వారి వర్గీయులు వస్తున్నారు. కార్పొరేటర్ వర్గీయుల్లో ఒకరు ‘మేం రాకుండా జెండా ఆవిష్కరిస్తారా? నువ్వు అంత పెద్ద రాజకీయం చేసేవాడివి అయ్యావా? అంటూ’ అనీల్‌ను ప్రశ్నించగా మీరు రావడం ఆలస్యమైంది సార్ ఇంకో చోటకు వెళ్లాల్సి ఉంది అందుకే ఆవిష్కరించారని జవాబిచ్చారు. అంతే. ఇరు వర్గాల వారు ఒకరికొకరు తిట్టుకోవడంలో రెచ్చిపోయారు. అందరి సమక్షంలో బాహాబాహీకి దిగి ఇరు వర్గాల వారు ముష్టికొమ్ములాటకు దిగారు. చదవండి: తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్ 1.. అసలు నిజం ఇదే! -
కుటుంబ పాలనను అంతం చేయండి
రామచంద్రాపురం: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్హాల్లో బీజేపీ, టీడీపీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జగ్గారెడ్డి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎదిగి బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ఎప్పుడు ముందుంటే మనస్తత్వం ఆయనదన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించి మెదక్ జిల్లా నుంచే టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే నీటి సమస్య, విద్యుత్ సమస్య ఉండదని చెప్పిన ఆయన ఇప్పుడు చేస్తుందేంటని ప్రశ్నించారు. ఈ సమస్యపై ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సచివాలయానికి పరిమితమై ఆదేశాలివ్వడానికే సరిపోతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్ పార్టీతో ఇప్పుడు కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తూర్పు జయప్రకాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని అది ఆయన హోదాకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్‌కుమార్‌గౌడ్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, విశ్వనాథం, రవీందర్, గిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అందోల్ నియోజకవర్గ కన్వీనర్ ఎల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కంకోల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న జగ్గారెడ్డిని చూసి టీఆర్ఎస్ ఆందోళనకు గురవుతోందని తెలిపారు. రాష్ర్టం విడిపోయిన తర్వాత కూడా ఆయనపై విమర్శలు చేయడం టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతి పక్ష పార్టీలను విమర్శించడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధికి పాటుపడాలే తప్ప ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం తగదని హితవు పలికారు. జగ్గారెడ్డి బరిలో ఉండటం వల్ల తమ అభ్యర్థి ఎక్కడ ఓడిపోతాడోననే భయం.. టీఆర్ఎస్ మంత్రులకు కునుకు లేకుండా చేస్తోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగ్గారెడ్డి గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి గెలుపు ఖాయం జిన్నారం: మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ.. పార్టీ గెలుపునకు ప్రతిఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. జగ్గారెడ్డి గెలుపునకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరారు. వీరిని రామచంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నాయకు లు అంజరెడ్డి, విష్ణువర్ధణ్రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
భారత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
బంజారాహిల్స్ : భిన్న మతాలకు నెలవైన భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచదేశాలు అన్ని మతాలను గౌరవిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్, అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, వరల్డ్ అలిబేట్ అసెంబ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అవెటైడ్ సేవియర్ ఇన్ వేరియస్ రిలీజియన్స్ అండ్ ఔట్లుక్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్’ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న మతాలపై అవగాహన) అన్న అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల్లో మతం పేరిట జరుగుతున్న హింసలో బలవుతున్నది సామాన్యులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ కాన్సులేట్ జనరల్ హసన్ నౌరీన్ మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ మతాలలోని మంచితనాన్ని గ్రహించి మానవాళి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. విశ్వవ్యాప్తంగా భిన్నమైన మతాలు, జాతులు, ఆచార సంప్రదాయాలు ఉన్నాయని, వీట న్నింటి సారం ఒక్కటేనని పేర్కొన్నారు. పరస్పరం ఘర్షణ పడటం మాని విశ్వశాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెన్రీ మార్టిన్ ఇనిస్టిట్యూట్ పాదర్ పీటీ శామ్యుల్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చింతల
హైదరాబాద్: ప్రధాన మంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపేందుకు, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన తిరిగి 27వ తేదీన నగరానికి రానున్నారు. భారత దేశ ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తాను హాజరుకావడం ఆనందంగా ఉందని ఇది తనకు దేవుడిచ్చిన వరమని చెప్పారు. ఖైరతాబాద్ నియోజక వర్గ ప్రజల తరపున ప్రతినిధిగా ఈ మహత్తర ఘట్టానికి హాజరవుతున్నట్లు చెప్పారు. నరేంద్రమోడీ స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో ఖైరతాబాద్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు 30 వేల మెజారిటీని కట్టబెట్టారంటే నరేంద్రమోడీపై స్థానికులన్న అభిమానానికి ఇది కొలబద్దని చెప్పారు. నియోజక వర్గంలో మంచి అభివృద్ధిని సాధించి నరేంద్రమోడీ లక్ష్యాలకు చేరువ అవుతామని వెల్లడించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఆరు డివిజన్లను గెలుచుకోవడమే లక్ష్యంగా తమ పనితనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.