భారత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
బంజారాహిల్స్ : భిన్న మతాలకు నెలవైన భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచదేశాలు అన్ని మతాలను గౌరవిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్, అల్-ముస్తఫా ఇంటర్‌నేషనల్ యూనివర్సిటీ, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, వరల్డ్ అలిబేట్ అసెంబ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అవెటైడ్ సేవియర్ ఇన్ వేరియస్ రిలీజియన్స్ అండ్ ఔట్‌లుక్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్’ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న మతాలపై అవగాహన) అన్న అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
వివిధ దేశాల్లో మతం పేరిట జరుగుతున్న హింసలో బలవుతున్నది సామాన్యులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ కాన్సులేట్ జనరల్ హసన్ నౌరీన్ మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ మతాలలోని మంచితనాన్ని గ్రహించి మానవాళి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. విశ్వవ్యాప్తంగా భిన్నమైన మతాలు, జాతులు, ఆచార సంప్రదాయాలు ఉన్నాయని, వీట న్నింటి సారం ఒక్కటేనని పేర్కొన్నారు. పరస్పరం ఘర్షణ పడటం మాని విశ్వశాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెన్రీ మార్టిన్ ఇనిస్టిట్యూట్ పాదర్ పీటీ శామ్యుల్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.