
కాంగ్రెస్‌లో చేరనున్న రాములమ్మ?
మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆమె ఇక త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఢిల్లీలో సమావేశం కావడంతో ఆ పార్టీలో చేరికపై మరింత స్పష్టత వచ్చింది. సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం. రంగారెడ్డి ద్వారా దిగ్విజయ్‌ను కలుసుకోవడం కూడా చర్చనీయాంశమైంది.
కాం గ్రెస్ పార్టీలో చేరికకు ఏది సరైన సమ యం?, ఎలా చేరాలనే అంశాలపై ఈ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దిగ్విజయ్‌సింగ్ సైతం కొన్ని సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపిన తర్వాత కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై అందరి చూపు కేంద్రీకృతమై ఉంది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం ద్వారా పార్టీని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునందన్ రావు కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్న వారిలో ఉన్నట్టు సమాచారం.
ఆంటోని కమిటీతో జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ..
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం రాత్రి ఆంటోని కమిటీతో సమావేశమై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో పాల్గొన వారిలో డిప్యూటీ సీఎం దామోదర, మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, నర్సారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆంటోని కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.