సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో 67.79 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. శనివారం సాయంత్రం 65.74 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించిన విషయం విదితమే. ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 67.79 శాతం పోలింగ్ నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 78.44 శాతం, పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యల్పంగా 54.57 శాతం పోలింగ్ నమోదైంది.
మెదక్ లోక్‌సభ పరిధిలో మొత్తం 15,43,075 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 10,46,080 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4,96,995 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గింది. అర్బన్ ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా పటాన్‌చెరు, సంగారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ కాగా, ప్రస్తుతం 67.79 శాతం జరిగింది. అంటే 9.56 శాతం మేర తగ్గింది. ఓటింగ్ శాతం తగ్గడం అభ్యర్థుల మెజార్టీపైనా ప్రభావం చూపనుంది.
ఇదిలా ఉంటే ఓటింగ్ శాతాన్ని కచ్చితంగా ప్రకటించడంతో జిల్లా అధికారులు విఫలమవుతున్నారు. శనివారం పోలింగ్ ముగిసిన అనంతరం 65.74 శాతం జరిగినట్టు ప్రకటించారు. అయితే మర్నాడు అధికారులు వెల్లడించిన వివరాలతో పోలిస్తే ఓటింగ్ శాతంలో వ్యత్యాసం ఉంది. గత సాధారణ ఎన్నికల్లో సైతం అధికారులు మొదట 88 శాతమని, ఆ తర్వాత 77 శాతం పోలింగ్ జరిగినట్లు ప్రకటించారు. మొత్తంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతాన్ని కచ్చితంగా గణించటంలో అధికారులు విఫలమవుతున్నారు.
ఎన్నికల అధికారుల మధ్య సమన్వయం లోపించటం వల్లే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వందశాతం పోలింగ్ సాధించటంలోనూ అధికారులు విఫలమయ్యారు. ఎన్నికలకు ముందు వందశాతం ఓటింగ్ సాధన కోసం అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ అది సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఉద్యోగులు, అక్షరాస్యులు అధికంగా ఉండే పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతంలో అతి తక్కువ శాతం నమోదుకావటం అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓటింగ్ శాతం తగ్గటానికి గల కారణాలను విశ్లేషించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఉపపోరులో 67.79 శాతం పోలింగ్
Published Mon, Sep 15 2014 12:07 AM | Last Updated on Tue, Oct 9 2018 5:54 PM
Advertisement
Advertisement