సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే పోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.
సిద్దిపేట, దుబ్బాక, పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కలిపి మొత్తం 1,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 15,43,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన మూడు నెలలకే వచ్చిన తొలి ఎన్నికలు.
పైగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా రాజీనామా చేయగా ఏర్పడిన ఖాళీ.. కనుక అన్ని ప్రధాన పార్టీలు ఉప పోరును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి తూర్పు జగ్గారెడ్డిలు పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరో 11 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం ఏకపక్షంగా ఉంటుం దని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీఆర్‌ఎస్ మెజారిటీపైనే...
ఉప పోరుపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. అయితే ఈ బెట్టింగ్ గెలుపు ఓటమిలపై కాకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది? రెండవ స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? మిగిలిన పార్టీలకు డిపాజిట్ వస్తుందా? రాదా? అనే దానిపైనే పందేలు కాస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి మూడు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని భారీగా పందెం కాస్తున్నారు. కాగా ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపడతారు.
గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే అప్పుడు 79 శాతం పోలింగ్ నమోదు కావటంతో అంత మెజార్టీ వచ్చింది. ఈ సారి 65 శాతం మించి పోలింగ్ నమోదు కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు ఉప ఎన్నిక కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించారని, భారీగా చేరికలు జరిగాయని, ప్రతి ఓటరు కూడా కారు గుర్తు వైపుకే మొగ్గు చూపే విధంగా ప్రచారం చేసి, పావులు కదిపారని, కనుక మెజార్టీ 3 లక్షలకు దాటిపోతుందని పందెం కడుతున్నారు. పందెం విలువ రూ. 1000 నుంచి లక్షల్లో కొనసాగుతోంది.
మెదక్ ఎంపీ ఉప పోరు నేడే
Published Sat, Sep 13 2014 1:12 AM | Last Updated on Tue, Oct 9 2018 5:54 PM
Advertisement
Advertisement