ఉపపోరుకు ఏర్పాట్లు
►ఏడు నియోజకవర్గాల్లో 1,817 పోలింగ్ కేంద్రాలు
►2,500 ఈవీఎంలు సిద్ధం చేస్తున్న అధికారులు
►ఎన్నికల విధుల్లో 8 వేల మంది సిబ్బంది
►26 నుంచి శిక్షణా తరగతులు, ఎన్నికల సామగ్రి పంపిణీ
►బందోబస్తులో పోలీసు శాఖ నిమగ్నం
సాక్షి, సంగారెడ్డి: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇన్‌చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి డా.ఎ.శరత్ పర్యవేక్షణలో అధికారులు ఎన్నిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప ఎన్నికకు సంబంధించి ఇది వరకే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావటంతో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజక వర్గాలుండగా, మొత్తం 15.36 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,75,528 మంది పురుషులు కాగా, 7,60,835 మంది మిహ ళలు.
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏడు నియోజకవర్గాల్లోని 1,074 ప్రాంతాల్లో 1,817 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కరెంటు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. ప్రత్యేక బృందాల నివేదిక అనంతరం పోలింగ్ కేంద్రాలను ప్రకటిస్తారు.
10 వేల మంది సిబ్బంది
ఉప ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది నియామకంపై ఎన్నికల అధికారులు ద ృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో మొత్తం పదివేల మంది సిబ్బంది పాలుపంచుకోనున్నారు. అధికారులు ఇప్పటి వరకు 8,690 మంది సిబ్బంది నియామకాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో 2,247 మంది ప్రిసైడింగ్ అధికారులు, 6,443 మంది పోలింగ్ ఆఫీసర్లు పాల్గొననున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నియామకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎన్నికల సిబ్బందికి త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
మొదటగా ఈనెల 26న నియోజకవర్గానికి 30 మంది చొప్పున ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు 30 తర్వాత నియోజకవర్గాల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇదిలావుంటే ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ఈవీఎంలను సమకూర్చుకోవటంపై అధికారులు ద ృష్టి సారించారు. ఈ మేరకు భెల్ నుంచి 2,500 కొత్త ఈవీఎంలను జిల్లాకు తెప్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
బందోబస్తుకు సిద్ధమవుతున్న పోలీసుశాఖ
ఉప ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై పోలీసుశాఖ ద ృష్టి సారించింది. ఎస్పీ శెముషీ బాజ్‌పాజ్ ఎన్నికల బందోబస్తుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఉప ఎన్నికలతోపాటు గణేష్ నవరాత్రి వేడుకలు వస్తున్నందున పోలీసులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో పోలీసు శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.