
సర్వే.. డౌటే!
►ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో సమగ్ర సర్వేపై సందిగ్ధం
►కోడ్ ప్రభావం ఉండకపోవచ్చు: ఇన్‌చార్జి కలెక్టర్
►ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తామంటున్న ఎన్నికల అధికారులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఈ నెల 19న నిర్వహించబోయే ఇంటింటి సర్వేపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో సర్వే నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నియమావళి ప్రకారం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. మెదక్ పార్లమెంటు స్థానంలో ఎన్నిక జరుగుతున్నప్పటికీ జిల్లా అంతటికీ కోడ్ వర్తిస్తుంది,
కనుక ఎన్నిక ఫలితాలు వచ్చేవరకు జిల్లాలో అధికారిక కార్యకలాపాలు, అభివృద్ధి పనులు దాదాపు నిలిచిపోతాయి. అయితే ఇంటింటి సర్వే ప్రణాళికను ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. కనుక దానిపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, సర్వేను యథాతథంగా నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెప్తూనే... ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమగ్ర సర్వేపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
సర్వే పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్లగా... సర్వేపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఇంటింటి సర్వేను ముందే ప్రకటించింది. సర్వే ప్రణాళిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కనుక సర్వేను యథాతథంగా కొనసాగించవచ్చని, పైగా ఇది కేవలం ప్రజలకు సంబంధించిన సమాచారాన్నే ప్రభుత్వం సేకరిస్తున్నందున ఎన్నికల కోడ్
ప్రభావం సర్వేపై ఉండదు’ అని చెప్పారు. కాగా 19న సర్వే ఉంటుందనే నమ్మకంలోనే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మాక్ సర్వే నిర్వహిస్తున్నారు.
రాష్ట్రం అంతటా ప్రభావం...
ఇంటింటి సమగ్ర సర్వేను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19 రాష్ట్రమంతటా ఏకకాలంలో, వేగంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే జిల్లాలో సర్వేపై ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం రాష్ట్రమంతటా ప్రభావం చూపనుంది. ఎన్నికల కమిషన్ నుంచి సర్వే కొనసాగింపుపై అనుకూల ప్రకటన వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కాని, ఒకవేళ ప్రతికూల ప్రకటన వస్తేనే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహణపై ప్రభావం పడనుంది.