వాళ్లు దిక్కుమాలిన ప్రయత్నాలు చేశారు
ప్రతి చిన్న విషయంలో తమను తప్పుబట్టే దిక్కుమాలిన ప్రయత్నాలను కొన్ని విపక్షాలు చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ లోక్సభా స్థానం ఉపఎన్నికలో విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
''ప్రజలకిచ్చిన ప్రతి మాటా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. జిల్లా మంత్రి, ఈ ఎన్నికల ప్రచార సారథి హరీశ్ రావుకు, అదే నియోజకవర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్, అక్కడకు వెళ్లి పనిచేసిన రాజయ్య గారికి, గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. కార్యకర్తల బలం, కృషి వల్లే ఇది సాధ్యమైంది. మాకు పూర్తి మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎంలకు కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో తేలిన అంశాలు కొన్ని ఉన్నాయి. చాలా చాలా అతిమాటలు కూడా విన్నాం. ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొద్ది కాలమే అయినా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, టీడీపీ, బీజేపీ నాయకులు అతి మాటలు మాట్లాడారు. ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారు. టీడీపీతో జతకట్టినందుకు బీజేపీకి కూడా బుద్ధి చెప్పారు. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు డిపాజిట్ మాత్రం దక్కించుకున్నారు.
ప్రతి విషయంలో తప్పుబట్టే దిక్కుమాలిన ప్రయత్నం చేశారు. బాధ్యత లేకుండా ప్రభుత్వం ప్రతి విధానాన్నీ తప్పుబట్టేలా గోబెల్స్ ప్రచారం చేశారు. దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. సర్వే అంటే, దుష్ప్రచారం. ఇంజనీరింగ్ కళాశాలల మీద చర్య, పేకాట క్లబ్బుల రద్దు, గృహనిర్మాణాల్లో అక్రమాల మీద విచారణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. ఇలా ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు తీసి ప్రచారం చేయబోతే ప్రజలు చావుదెబ్బ కొట్టారు. మీ అతితెలివి పనికిరాదని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వాటిని మేం స్వాగతిస్తాం. కానీ అనవసరంగా ప్రతి విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకితే మీకే బూమెరాంగ్ అవుతుంది.
అమరుల త్యాగఫలితంగా తెలంగాణ ఏర్పడింది. అడ్డదిడ్డంగా పనిచేస్తే కుదరదు. కొంత టైం తీసుకుని పూర్తిగా పరిస్థితులను అర్థం చేసుకుని పనులు చేస్తాం. నిజం చెప్పాలంటే కేసీఆర్ మార్కు పాలన, టీఆర్ఎస్ మార్కు పాలన ఇంకా తెలంగాణలో ప్రారంభం కాలేదు. మేమింకా మా పని మొదలుపెట్టలేదు. మా ఎజెండా సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాం. దసరా నుంచి పథకాలు ప్రారంభం అవుతాయి. పెన్షన్లు, ఇళ్ల నిర్మాణాలు.. ఇలా అన్నింటిపై దసరా, దీపావళి మధ్య చాలా ఉత్తర్వులు జారీచేస్తాం. మా తల తెగిపడ్డా.. మాట ఇచ్చామంటే అమలుచేస్తాం తప్ప వెనక్కి పోయే పరిస్థితి లేదు'' అని ఆయన చెప్పారు.