భయపడలేదు.. భయపడేదీ లేదు: పొన్నాల
ఓడిపోయినంత మాత్రాన మేమెప్పుడూ భయపడలేదు, భయపడేది లేనే లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి పీసీసీ అధ్యక్షుడిగా తానే బాధ్యత వహిస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు.
మెదక్ లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నాల ఏమన్నారంటే.. ''గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రపతి పాలన ఉంది. రాజకీయ పార్టీలన్నీ పార్టీలుగానే పోటీపడ్డాయి. అప్పుడు అధికార, ప్రతిపక్షాలేమీ లేవు. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ తెలంగాణలో, టీడీపీ ఆంధ్రలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్న రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మూడూ కూడా అధికార పక్షమైన టీఆర్ఎస్కు పూర్తి మద్దతు పలికాయి. వాళ్ల విధానాలను వ్యతిరేకిస్తూనే పోటీ మాత్రం పెట్టలేదు. అంటే గతంలో ఏకపార్టీగా ఉన్న టీఆర్ఎస్కు ఇప్పుడు మూడు పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంటు పరిధిలో బలమైన మాదిగ సామాజికవర్గం ఈసారి బీజేపీకి మద్దతు పలికింది. టీడీపీ-బీజేపీ అధికారపక్షాలై ఉండి, వాళ్ల మద్దతు ఉన్నా కూడా కాంగ్రెస్ కంటే వెనకబడ్డారు. గత మూడుసార్లుగా ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ చేతిలో ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఇక్కడ ప్రచారంలో ఉన్నారు. అధికారబలం, అంగబలం, అర్థబలం ఎన్నికల్లో పనిచేస్తాయి. ఇది నగ్నసత్యం. ఈ పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గట్టిపోటీ ఇవ్వగలిగింది. ప్రజలపక్షాన తన వాదన వినిపించింది'' అని ఆయన చెప్పారు.