మెదక్‌లో 25 లక్షల విలువైన చీరలు, ప్యాంట్లు స్వాధీనం
ఓటర్లకు పంచేందుక సిద్ధం చేసిన వైనం
బీజెపీ లోక్‌సభ అభ్యర్థి నరేంద్రనాథ్ అరెస్ట్..
అనంతరం బెయిల్‌పై విడుదల
హైదరాబాద్: ఓటర్లకు పంచడానికి పెద్ద మొత్తంలో చీరెలు, ప్యాంట్లు, షర్టులు, గడియారాలు సిద్ధం చేసిన మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సీహెచ్. నరేంధ్రనాథ్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపురంలో ఒక్క చోటే బీజెపీ కమలం గుర్తు, సీహెచ్. నరేంధ్రనాథ్ పేరు ముద్రించి ఉన్న 25 లక్షల రూపాయల విలువగల చీరెలు, ప్యాంట్లు, షర్టులు, అల్మారాలు, గోడ వాచీలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్‌చెరువు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరెలు, ప్యాంట్లు, షర్టులు స్వాధీనం చేసుకోగా, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు నివేదిక పంపించారు.
దానిని భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. ఈ విషయాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఆ వస్తువులన్నీ తనవేనని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందుగా పంపిణీకి సిద్ధం చేశానని నరేంద్రనాథ్ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 (1)-ఎ కింద కమిషన్ నిర్ణయం తీసుకోవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. నామినేషన్‌ను కూడా తిరస్కరించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.