
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
టీపీసీసీ విస్తృతస్థాయి భేటీలో చర్చ
చిన్నారెడ్డి ప్రతిపాదనకు సానుకూల స్పందన
ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు
24, 25 తేదీల్లోనే సదస్సు: కుంతియా, పొన్నాల
సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉం టుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్‌సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఒక ప్రతిపాదన వచ్చింది.
పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని ప్రతిపాదిం చారు. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్‌ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. చిన్నారెడ్డి ప్రతిపాదన పట్ల పలువురు నేతలు సానుకూలంగా స్పందిం చారు. ఈ నెల 24, 25 తేదీల్లో కాంగ్రెస్ రాష్ర్ట సదస్సు నిర్వహణపై సమావేశం లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఓటమికి నాయకత్వ లోపమనే కారణమనే ఆవేశంతో కార్యకర్తలు ఉన్నారని, ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహిస్తే వారి ఆగ్రహం మరిం త రెట్టింపవుతుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బలరాం నాయక్ సూచించారు.
హైకమాండ్ నిర్ణయం తీసుకున్నందున సదస్సు నిర్వహించి తీరాల్సిందేనంటూ డీకే ఆరుణ, నంది ఎల్లయ్య అన్నారు. అధికారంలో ఉన్నప్పు డు కార్యకర్తలను పట్టించుకోలేదని, సదస్సు వేదికగానైనా వారి ఆవేదనను పంచుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సమావే శం అనంతరం కుంతియా, పొన్నాల మాట్లాడుతూ హైకమాండ్ మాత్రం ఈ నెల 24, 25 తేదీల్లో సదస్సు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కార్యాచరణను రూపొందిస్తామని తెలి పారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, సీనియర్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ సహా పలువురు సీనియర్ నాయకులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
రాష్ట్రానికి దిగ్విజయ్‌సింగ్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సోదరుడు కుమారుడి వివాహానికి హాజరయ్యారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ రావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.