సదస్సులో మాట్లాడుతున్న కోదండరాం. చిత్రంలో సీతక్క, తమ్మినేని
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): రాష్ట్రంలో పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని, పెసా చట్టాన్ని అమలు చేయాలన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పోడురైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పలు పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తరతరాలుగా భూములను సాగుచేస్తూ అడవులను కాపాడుతున్న గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అటవీ హక్కులను సాధించుకునేందుకు అక్టోబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే రాస్తారోకోను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ వేలాది ఎకరాల భూమి కొద్దిమంది చేతుల్లోనే ఉందని, ఈ భూములు సరిపోవడం లేదని గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘అటవీప్రాంతం ఉన్న అన్ని ప్రాంతాల్లో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో అడవిని నమ్ముకుని జీవించేవారికి బతుకులేకుండా చేస్తున్నారు’అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీ మంచ్ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ బాబూరావు మాట్లాడుతూ అనేక పోరాటాల వల్ల వచ్చిన ఈ చట్టాన్ని ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని ధ్వజమెత్తారు.
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోటు రంగారావు మాట్లాడుతూ ఏళ్లుగా పోడు చేసుకుని బతుకుతున్న వారి భూములను ప్రభుత్వం లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భూమి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భవానిరెడ్డి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర్‌రావు, గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే నర్సయ్య, రైతు స్వరాజ్య వేదిక నాయకులు రవి, రంగారావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐఎంఎల్ నాయకులు ప్రసాదన్న, ఆదివాసీ నాయకులు బాబూదొర, టీపీఎఫ్ అధ్యక్షులు రవిచంద్ర, టీడీపీ నాయకులు ఇందిర, ఎంసీపీఐయూ నాయకులు రవి, జనసేన నాయకులు శంకర్‌గౌడ్, ఏఐకెఎంఎస్ నాయకులు అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment