సాక్షి, మంచిర్యాల : జిల్లాలో పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. ఆషాఢం ము గిసిన తర్వాత మంత్రి మండలి విస్తరణతోపాటు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల నియామకాన్ని సీఎం కేసీఆర్ చేపడతారనే వార్తల నేపథ్యంలో నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు తప్పనిసరిగా బెర్తు దక్కుతుందనే నేపథ్యంలో ఇద్దరు ఆశావహులు ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు జిల్లాకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మంత్రి పదవి ఖరారు అనే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి.
గిరిజన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, మహిళా కోటాను భర్తీ చేయడం, విశాలమైన జిల్లాలో తూర్పు ప్రాంతానికి మంత్రి పదవి కేటాయించడం ద్వారా సమన్యాయం చేయడం అనే అంశాలు లక్ష్మికి కలిసిరానున్నాయి. ఇదే అమాత్య పదవి కోసం పశ్చిమ జిల్లాకు చెందిన సీనియర్ నేత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పశ్చిమ జిల్లాకే రెండు మంత్రి పదవులు దక్కడంతో తూర్పు జిల్లాను పట్టించుకోవడం లేదనే అపప్రద వస్తుందనే భావన, ఇప్పటికే నిర్మల్ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం కేటాయించడం, ఆయన సామాజికవర్గానికి చెందిన వారు మంత్రివర్గంలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఐకేరెడ్డికి ఇబ్బందిగా మారే లా కనిపిస్తున్నాయి.
అయినప్పటికీ పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చినట్లుగా, సీఎం కేసీఆర్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాల ద్వారా మంత్రి పదవిని దక్కించుకోవచ్చని ఐకేరెడ్డి సన్నిహితులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఐకేరెడ్డికి మంత్రి పదవి దక్కనిపక్షంలో నామినేటెడ్ కోటాలో రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంత్రి పదవికి తన అభ్యర్తిత్వాన్ని పరిశీలించాలని పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు.
తూర్పు నేతకే ఎమ్మెల్సీ..
మంత్రి పదవికోసం ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుంటే పార్టీలో పూర్వం నుంచి కష్టపడుతున్న నాయకులు తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న రాములు నాయక్‌ను జిల్లా కోటాలో పశ్చిమ వాసిగా పరిగణించే అంశం కూడా కలిసిరానుంది. మరోవైపు నిర్మల్ స్థానం నుంచి బరిలో దిగి ఓటమి పాలైన శ్రీహరిరావు ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
పదవుల పందేరానికి నాయకులు తూర్పు-పశ్చిమ జిల్లా రంగులు అద్దుతున్నారు. ఒక ప్రాంతం వైపే న్యాయం చేయడం సరికాదని, సమన్యాయం ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే రాష్ర్టస్థాయి నామినేటెడ్ పదవుల కోసం ఇప్పట్నుంచే నేతల తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు.
ఆశల పల్లకి
Published Wed, Jul 23 2014 12:42 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement