Positions nominated
-
మళ్లీ ఆశలు!
తెరపైకి నామినేటెడ్ పదవుల పందారం 15రోజుల్లో జాబితా రూపకల్పనకు సీఎం ఆదేశం పైరవీలకు పదునుపెట్టిన ఆశావహులు విశాఖపట్నం :ఎప్పటికప్పుడు ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పదవుల పందారం మళ్లీ తెరపైకి వచ్చింది. టీడీపీ గద్దెనెక్కి ఏడాదిన్నర కావస్తోంది. రాకరాక పదేళ్లకు అధికారం రావడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. తొలుత దసరాకల్లా భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత సంక్రాంతికల్లా భర్తీ చేస్తాం.. ఉగాది కల్లా భర్తీ చేస్తాం.. అంటూ ఊరిస్తూ వస్తున్నారు. కొన్ని మార్కెట్ కమిటీలు మినహా ఇతర నామినేటెడ్ పదవులను మాత్రం భర్తీ చేయలేదు. మళ్లీ దసరా వచ్చేస్తోంది. ఇప్పటికైనా తమ ఆశలు నెరవేరుతాయో లేదో తెలియక అయోమయంలో ఉన్న ఆశావహుల్లో విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆశలు చిగురింపచేసింది. అర్హుల జాబితాను 15 రోజుల్లోగా పంపాలని పార్టీ నేతలను ఆయన స్వయంగా ఆదేశించడంతో మళ్లీ ఈ పదవుల పందారం తెరపైకి వచ్చింది. జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీల్లో నాలుగు కమిటీలు నియామకం మాత్రమే జరిగింది. ఇంకా విశాఖ, భీమిలి, అనకాపల్లి, చోడవరం మార్కెట్ కమిటీల నియామకం కొలిక్కి రాలేదు. మరో పక్క రాష్ర్ట స్థాయిలో ప్రసిద్ధి చెందిన సింహాచలం, కనకమహాలక్ష్మి, ఉపమాక, అనకాపల్లి నూకాలమ్మ, పాడేరు మొదకొండమ్మ దేవస్థానాలతో పాటు దేవాదాయశాఖ అధీనంలో ఉన్న చిన్నా, చితకా దేవాలయాలన్నీ కలపి సుమారు ఐదారొందలకుపైగా ఉన్నాయి. కేజీహెచ్‌తో సహా ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీలు, జిల్లా, మండల స్థాయిల్లో ఆహార సలహా సంఘాలు ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. రాష్ర్ట స్థాయిలో దాదాపు అన్ని కార్పొరేషన్ పదవులు విభజన తర్వాత భర్తీకి నోచుకోలేదు. వీటిపై ఆశలు పెట్టుకున్న వారు పైరవీలు.. లాబీయింగులు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ పదవులను ఆశించి భంగపడిన వారంతా కనీసం రాష్ర్ట స్థాయి కార్పొరేషన్ పదవులైనా దక్కకపోతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్‌గా బరిలోకి దిగి చివరి నిముషంలో అధిష్టానం ఒత్తిడి మేరకు వెనక్కి తగ్గిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుతో పాటు రూరల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, మాజీ మంత్రి మణికుమారి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాని వారిలో పలువురు రాష్ర్ట స్థాయి కార్పొరేషన్ పదవులపై గురిపెట్టారు. జిల్లా పరిధిలో ఉండే నామినేటెడ్ పదవులను ఆశించే వారు సైతం మరోసారి ఎమ్మెల్యేల ప్రసన్నం కోసం తిరుగుతున్నారు. జిల్లా పరిధిలోని పలు దేవాదాయ కమిటీలు, పెండింగ్‌లో ఉన్న ఏఎంసీలు, ఇతర కీలక పదవుల కోసం అర్హులైన వారి జాబితాలు సిద్ధం చేసే పనిలో స్థానిక ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు మాత్రమే చోటుండేది. ఇక నుంచి వీరితో పాటు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా అవకాశమివ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా నామినేటెడ్ పదవుల పందారం మళ్లీ తెరపైకి రావడంతో తెలుగుతమ్ముళ్లలో ఆశలు చిగురిస్తున్నాయి. -
కేంద్రంలో ఉన్నా ఒరిగిందేమిటి..?
బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లో నిర్వేదం నామినేటెడ్ పదవులకోసం నిరీక్షణలో కమలం నేతలు హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నా తమకు ఒరిగిందేమిటని బీజేపీ రాష్ట్ర నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పార్టీని విస్తరించడానికి అవసరమైన స్థాయిలో తెలంగాణ పార్టీ నేతలను బలోపేతం చేయడం లేదని ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు ముఖ్యనేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందినవారికే ఇప్పుడు కూడా అవకాశాలు వచ్చాయని, కొత్తవారిని ప్రోత్సహించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి, మాజీ కేంద్రమంత్రి సి.హెచ్.విద్యాసాగర్‌రావుకు మహారాష్ట్ర గవర్నరు పదవి తప్ప తెలంగాణ రాష్ర్ట పార్టీని కేంద్ర ప్రభుత్వం, జాతీయపార్టీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరాల చంద్రశేఖర్‌రావు, సినీనటి జీవిత, చింతా సాంబమూర్తి, రాములుకు చిన్నచిన్న పదవులు దక్కాయి. అయితే ఇవేవీ నిత్యం ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే స్థాయి పదవులు కాదు. ఇప్పటిదాకా పార్టీకోసం పనిచేస్తున్నవారిని నామినేటెడ్ పదవులకోసం రాష్ట్రపార్టీ ఇప్పటిదాకా సుమారు 200 మంది నాయకుల పేర్లను జాతీయపార్టీకి నివేదించింది. అయితే రాష్ట్రపార్టీ ప్రతిపాదనలతో సంబంధం లేకుండా కూడా కొందరికి నామినేటెడ్ పదవులు దక్కినట్టుగా తెలుస్తోంది. సినీనటి జీవితకు సెన్సారుబోర్డులో అవకాశం దక్కిన సందర్భంగా రాష్ట్ర పార్టీ బాధ్యులను పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు గతంలో నిలదీశారు. జీవిత నియామకంపై రాష్ట్ర పార్టీకి సమాచారం లేదని, ఆమెకు పదవి ఎలా వచ్చిందో తమకు తెలియదని రాష్ట్రపార్టీ బాధ్యులు ఆ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకోసం దశాబ్దాల తరబడి చాకిరీ చేస్తున్నవారిలో చాలామందికి దిక్కూదివాణం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని అవకాశంగా తీసుకుని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు చర్యలేమీ తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎంతో దూకుడుగా ఉన్నదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ తప్ప మరే పార్టీకి మనుగడ లేకుండా చేయాలనే దూరదృష్టితో పనిచేస్తున్నా బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాల్లో దీటుగా ఎదుర్కోవాలనే యోచన లేదని విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు ఎదురొడ్డి పోరాడేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. అధికారపార్టీపై పోరాటం చేయడానికి అవసరమైన ఆయుధాలను ఇవ్వకుండా, ఆ పార్టీపై పోరాడెదెలా అని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిటారుకొమ్మన పదవీ పొట్లం
సాక్షి ప్రతినిధి, కడప: నామినేటెడ్ పదవులు అధికారపార్టీ నేతల్ని ఊరిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచే ఏదో ఒక పదవి చేజిక్కించుకోవాలని జిల్లా నేతలు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేశాం, ఈమారైనా గుర్తింపు దక్కుతుందనే ఆశాభావంతో పలువురు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నేరుగా అధిష్టానానికి చెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం టీడీపీలో లేకపోవడంతో నాయకులు సందిగ్ధంలో పడ్డారు. పూర్వపు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అగ్రస్థానం ఉండేది. ప్రస్తుతం టీడీపీలో పదవులు దక్కించుకోవడం ఆశామాషీ వ్యవహరం కాదనే ఆపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఓవైపు పోటీదారులను ఎదుర్కొవడమే కాకుండా అంచెలంచెలుగా నాయకుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆపార్టీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఉన్నతి కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నాయకుల్ని కాదని పైరవీకారులకు అగ్రస్థానం దక్కుతోందన్న ఆందోళన తెలుగుతమ్ముళ్లుల్లో అధికమైంది. ఈక్రమంలో క్రమశిక్షణగా మెలిగిన నాయకులను పదవులు వరిస్తాయా? అన్న సందేహం నేతల్లో ఎక్కువైంది. ఎమ్మెల్సీ రేసులో ఆ ఇద్దరు... జిల్లాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే తమను దాటిపోదని జిల్లా అధ్యక్షుడు ఎం లింగారెడ్డి, రైల్వేకోడూరు ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథనాయుడు ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీకోసం కష్టపడ్డ నాయకులకే పదవులు అని స్వయం గా అధినేత చంద్రబాబు చెప్పినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకోసం టికెట్‌ను త్యాగం చేసిన లింగారెడ్డికి ఎమ్మెల్సీ దక్కుతుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అవిశాంత్రంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమ నాయకుడుకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని రైల్వేకోడూరు ఇన్‌ఛార్జి విశ్వనాథనాయుడు వర్గీయులు పేర్కొం టున్నారు. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చాం. ఈమారు పదవి అప్పగిస్తే భవిష్యత్‌లో కేడర్‌ను సమీకరించుకుని పార్టీ ఉన్నతికి విశేషంగా పాటుపడే అవకాశం ఉందని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం భావిస్తోంది. ఎమ్మెల్సీ పదవిపై వీరు ముగ్గురు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారిలో ఇరువురు నేతలకు ఆయా నియోజకవర్గాల నేతల నుంచి వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు పదవిని కట్టబెట్టి ఆ దుకోవాలని ఓటమి చెందిన నాయకుల నుంచి కూడా అభ్యర్థనలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. అలాంటి వారిలో జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి పట్ల మాత్రమే సీఎం కొంత సానుకూల దృక్పదంతో ఉన్నట్లు సమాచారం. కనీస గుర్తింపు కోసం ఆరాటం... వ్యక్తిగత బలబలాలు ఎలా ఉన్నా, పదవి దక్కించుకనేందుకు పోటీ పడుతోన్న నేతల జాబితా పెద్దగానే ఉంది. ఇప్పటికే మైదుకూరు, రాజంపేట, రాయచోటి, సిద్ధవటం మార్కెట్ కమిటీ ఛైర్మన్ స్థానాలను భర్తీ చేశారు. ప్రధానమైన కడప, ప్రొద్దుటూరుతో పాటు పులివెందుల స్థానాలను భర్తీ చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కొరవడడమే కారణం. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి పదవుల్ని జిల్లా నేతలకు అప్పగించి పార్టీని బలోపేతం చేయాలనే తలంపు కన్పించడం లేదనే భావనలో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి అందులోనే పుట్టిపెరిగిన నాయకుల్ని పరిగణలోకి తీసుకొనే పరిస్థితులు సైతం కన్పించడం లేదనే ఆవేదన ఆపార్టీ శ్రేణుల్లో కన్పిస్తోంది. పెపైచ్చు జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, దానిని భర్తీ చేయాలనే తలంపు ప్రధాన నాయకుల్లో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. -
పైరవీలు
- నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల పోటీ - అధినేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నం - తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్న సిద్ధు - సిద్ధమవుతున్న రెండు జాబితాలు - 10న అంతిమంగా ఒక జాబితా వెలువడే అవకాశం! సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. ఆశావహులు అటు కేపీసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇటు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ‘కృష్ణ’ చుట్టూ అధినాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయినా కూడా ఇప్పటికీ వివిధ మండళ్లు, బోర్డు అధ్యక్ష పదవులు తదితర నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. ఈ పదవులపై ఆ పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది నాయకులు కన్నేశారు. అయితే ఆశావహులకు సంబంధించి ‘కేపీసీసీ’ కార్యాలయంలో ఒక జాబితా, ‘కృష్ణ’లో మరో జాబితా సిద్ధమవుతోంది. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నవారు మొదట కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలోదరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను పార్టీ బ్లాక్ స్థాయి అధ్యక్షుడితో పాటు జిలా ఇన్చార్జ్ మంత్రి పరిశీలించి కేపీసీసీ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తయింది. కేపీసీసీకి చేరిన దరఖాస్తులను పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు మరికొంత మంది ముఖ్యమైన పదాధికారులు పరిశీలిస్తూ జాబితాను తయారు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు మహిళలకు ‘కేపీసీసీ’ పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోవైపు నామినేటెడ్ పదవులపై కన్నేసిన వారి నుంచి సిద్ధరామయ్య నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 2013 శాసనసభ, అటుపై వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసి కూడా ఓటమి పాలయిన వారు, ఆశావహుల స్థానికత, అక్కడి ప్రతిపక్షాల బలాబలాలు, తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ ‘కృష్ణ’లో మరో జాబితా సిద్ధమవుతోంది. దీంతో అటు కేపీసీసీతో పాటు ఇటు కృష్ణ చుట్టూ కూడా ఆశావహులు చక్కర్లు కొడుతూ అధినాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా, కృష్ణలో తయారవుతున్న జాబితాలో సీఎం సిద్ధరామయ్య తన అనుచరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య, పరమేశ్వర్ల మధ్య ఈ నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై గతంలోనే ఒకసారి గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అలా జరగకుండా సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే ఇరువురు నాయకులకు పార్టీ హై కమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై ఇరువురు నాయకులు కలిసి చర్చించి అంతిమంగా ఒక నిర్ణయానికి రానున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 10న నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన వ్యక్తుల మొదటి జాబితా విడుదలవుతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆశల పల్లకి
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. ఆషాఢం ము గిసిన తర్వాత మంత్రి మండలి విస్తరణతోపాటు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల నియామకాన్ని సీఎం కేసీఆర్ చేపడతారనే వార్తల నేపథ్యంలో నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు తప్పనిసరిగా బెర్తు దక్కుతుందనే నేపథ్యంలో ఇద్దరు ఆశావహులు ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు జిల్లాకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మంత్రి పదవి ఖరారు అనే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి. గిరిజన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, మహిళా కోటాను భర్తీ చేయడం, విశాలమైన జిల్లాలో తూర్పు ప్రాంతానికి మంత్రి పదవి కేటాయించడం ద్వారా సమన్యాయం చేయడం అనే అంశాలు లక్ష్మికి కలిసిరానున్నాయి. ఇదే అమాత్య పదవి కోసం పశ్చిమ జిల్లాకు చెందిన సీనియర్ నేత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పశ్చిమ జిల్లాకే రెండు మంత్రి పదవులు దక్కడంతో తూర్పు జిల్లాను పట్టించుకోవడం లేదనే అపప్రద వస్తుందనే భావన, ఇప్పటికే నిర్మల్ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ పీఠం కేటాయించడం, ఆయన సామాజికవర్గానికి చెందిన వారు మంత్రివర్గంలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఐకేరెడ్డికి ఇబ్బందిగా మారే లా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చినట్లుగా, సీఎం కేసీఆర్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాల ద్వారా మంత్రి పదవిని దక్కించుకోవచ్చని ఐకేరెడ్డి సన్నిహితులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఐకేరెడ్డికి మంత్రి పదవి దక్కనిపక్షంలో నామినేటెడ్ కోటాలో రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంత్రి పదవికి తన అభ్యర్తిత్వాన్ని పరిశీలించాలని పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. తూర్పు నేతకే ఎమ్మెల్సీ.. మంత్రి పదవికోసం ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుంటే పార్టీలో పూర్వం నుంచి కష్టపడుతున్న నాయకులు తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న రాములు నాయక్‌ను జిల్లా కోటాలో పశ్చిమ వాసిగా పరిగణించే అంశం కూడా కలిసిరానుంది. మరోవైపు నిర్మల్ స్థానం నుంచి బరిలో దిగి ఓటమి పాలైన శ్రీహరిరావు ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల పందేరానికి నాయకులు తూర్పు-పశ్చిమ జిల్లా రంగులు అద్దుతున్నారు. ఒక ప్రాంతం వైపే న్యాయం చేయడం సరికాదని, సమన్యాయం ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే రాష్ర్టస్థాయి నామినేటెడ్ పదవుల కోసం ఇప్పట్నుంచే నేతల తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. -
ఆశల పల్లకీలో గులాబీ నేతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ పోస్టులపై గురి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు ఎలాగైనా పదవులను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోస్తు న్న ద్వితీయ శ్రేణి నేతలు ప లువురు తమ స్థాయిని బట్టి పదవులను ఆశిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రాపకా న్ని ముందే పొందిన నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం అనివార్యంగా మారిన నేపథ్యంలో ఏ ప్రాతిపదికను పాటిస్తారోనన్న చర్చ జరుగుతోంది. ‘ఎమ్మెల్సీ’ ఎవరిని వరించేనో.. జిల్లాలో రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలిచి టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆధిష్టానం రాజకీయంగా, అభివృద్ధి పరంగా జిల్లాకు ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా కింద జిల్లాకు చెందిన నాయకుడికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు కోసం పలువురు సీనియర్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్, రూరల్‌ల నుంచి టికెట్ ఆశించిన బస్వా లక్ష్మీనర్సయ్య, డాక్టర్ భూపతిరెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ ప్రకటించిన ఐదారు రోజులకే బస్వా లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఎమ్మెల్సీ రేసులో జిల్లాకు చెందిన డాక్టర్ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌లు మిగిలారు. అలాగే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిలు ఈ పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ, కార్పొరేషన్లపైన.. పలువురు సీనియర్ నేతలు రాష్ర్ట, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులపై గురి పెట్టారు. ఆగ్రోస్, ఆర్టీసీ తదితర కార్పొరేషన్ల చైర్మన్లు, డెరైక్టర్ల స్థానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి పదవుల వేటలో పడేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. డీపీసీ, విజిలెన్స్ మానిటరింగ్, జడ్పీ, మండల, కార్పొరేషన్, మున్సిపాలిటీలలో కోఆప్షన్ సభ్యుల కోసం కొందరు ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలను కలిసి, తమ పేర్లను ప్రతిపాదించాలని కోరుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, పిట్లం, గాంధారి తదితర ఏఎంసీల చైర్మన్, డెరైక్టర్ పదవుల కోసం సిఫారసులు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన నిట్టు వేణుగోపాల్‌రావు, పున్న రాజేశ్వర్లతో పాటు అన్ని నియోజకవర్గాల నాయకులు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ద్వితీయశ్రేణి నాయకులు చక్కర్లు కొడుతున్నారు. వీరి ఆశలను కేసీఆర్ ఏ విధంగా నెరవేరుస్తారో వేచి చూడాలి.