మళ్లీ ఆశలు!
తెరపైకి నామినేటెడ్ పదవుల పందారం
15రోజుల్లో జాబితా రూపకల్పనకు సీఎం ఆదేశం
పైరవీలకు పదునుపెట్టిన ఆశావహులు
విశాఖపట్నం :ఎప్పటికప్పుడు ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పదవుల పందారం మళ్లీ తెరపైకి వచ్చింది. టీడీపీ గద్దెనెక్కి ఏడాదిన్నర కావస్తోంది. రాకరాక పదేళ్లకు అధికారం రావడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. తొలుత దసరాకల్లా భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత సంక్రాంతికల్లా భర్తీ చేస్తాం.. ఉగాది కల్లా భర్తీ చేస్తాం.. అంటూ ఊరిస్తూ వస్తున్నారు. కొన్ని మార్కెట్ కమిటీలు మినహా ఇతర నామినేటెడ్ పదవులను మాత్రం భర్తీ చేయలేదు. మళ్లీ దసరా వచ్చేస్తోంది. ఇప్పటికైనా తమ ఆశలు నెరవేరుతాయో లేదో తెలియక అయోమయంలో ఉన్న ఆశావహుల్లో విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆశలు చిగురింపచేసింది. అర్హుల జాబితాను 15 రోజుల్లోగా పంపాలని పార్టీ నేతలను ఆయన స్వయంగా ఆదేశించడంతో మళ్లీ ఈ పదవుల పందారం తెరపైకి వచ్చింది.
జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీల్లో నాలుగు కమిటీలు నియామకం మాత్రమే జరిగింది. ఇంకా విశాఖ, భీమిలి, అనకాపల్లి, చోడవరం మార్కెట్ కమిటీల నియామకం కొలిక్కి రాలేదు. మరో పక్క రాష్ర్ట స్థాయిలో ప్రసిద్ధి చెందిన సింహాచలం, కనకమహాలక్ష్మి, ఉపమాక, అనకాపల్లి నూకాలమ్మ, పాడేరు మొదకొండమ్మ దేవస్థానాలతో పాటు దేవాదాయశాఖ అధీనంలో ఉన్న చిన్నా, చితకా దేవాలయాలన్నీ కలపి సుమారు ఐదారొందలకుపైగా ఉన్నాయి. కేజీహెచ్‌తో సహా ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీలు, జిల్లా, మండల స్థాయిల్లో ఆహార సలహా సంఘాలు ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. రాష్ర్ట స్థాయిలో దాదాపు అన్ని కార్పొరేషన్ పదవులు విభజన తర్వాత భర్తీకి నోచుకోలేదు. వీటిపై ఆశలు పెట్టుకున్న వారు పైరవీలు.. లాబీయింగులు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ పదవులను ఆశించి భంగపడిన వారంతా కనీసం రాష్ర్ట స్థాయి కార్పొరేషన్ పదవులైనా దక్కకపోతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్‌గా బరిలోకి దిగి చివరి నిముషంలో అధిష్టానం ఒత్తిడి మేరకు వెనక్కి తగ్గిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుతో పాటు రూరల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, మాజీ మంత్రి మణికుమారి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాని వారిలో పలువురు రాష్ర్ట స్థాయి కార్పొరేషన్ పదవులపై గురిపెట్టారు.
జిల్లా పరిధిలో ఉండే నామినేటెడ్ పదవులను ఆశించే వారు సైతం మరోసారి ఎమ్మెల్యేల ప్రసన్నం కోసం తిరుగుతున్నారు. జిల్లా పరిధిలోని పలు దేవాదాయ కమిటీలు, పెండింగ్‌లో ఉన్న ఏఎంసీలు, ఇతర కీలక పదవుల కోసం అర్హులైన వారి జాబితాలు సిద్ధం చేసే పనిలో స్థానిక ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు మాత్రమే చోటుండేది. ఇక నుంచి వీరితో పాటు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా అవకాశమివ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా నామినేటెడ్ పదవుల పందారం మళ్లీ తెరపైకి రావడంతో తెలుగుతమ్ముళ్లలో ఆశలు చిగురిస్తున్నాయి.