కేంద్రంలో ఉన్నా ఒరిగిందేమిటి..?
బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లో నిర్వేదం
నామినేటెడ్ పదవులకోసం నిరీక్షణలో కమలం నేతలు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నా తమకు ఒరిగిందేమిటని బీజేపీ రాష్ట్ర నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పార్టీని విస్తరించడానికి అవసరమైన స్థాయిలో తెలంగాణ పార్టీ నేతలను బలోపేతం చేయడం లేదని ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు ముఖ్యనేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందినవారికే ఇప్పుడు కూడా అవకాశాలు వచ్చాయని, కొత్తవారిని ప్రోత్సహించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి, మాజీ కేంద్రమంత్రి సి.హెచ్.విద్యాసాగర్‌రావుకు మహారాష్ట్ర గవర్నరు పదవి తప్ప తెలంగాణ రాష్ర్ట పార్టీని కేంద్ర ప్రభుత్వం, జాతీయపార్టీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరాల చంద్రశేఖర్‌రావు, సినీనటి జీవిత, చింతా సాంబమూర్తి, రాములుకు చిన్నచిన్న పదవులు దక్కాయి. అయితే ఇవేవీ నిత్యం ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే స్థాయి పదవులు కాదు.
ఇప్పటిదాకా పార్టీకోసం పనిచేస్తున్నవారిని నామినేటెడ్ పదవులకోసం రాష్ట్రపార్టీ ఇప్పటిదాకా సుమారు 200 మంది నాయకుల పేర్లను జాతీయపార్టీకి నివేదించింది. అయితే రాష్ట్రపార్టీ ప్రతిపాదనలతో సంబంధం లేకుండా కూడా కొందరికి నామినేటెడ్ పదవులు దక్కినట్టుగా తెలుస్తోంది. సినీనటి జీవితకు సెన్సారుబోర్డులో అవకాశం దక్కిన సందర్భంగా రాష్ట్ర పార్టీ బాధ్యులను పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు గతంలో నిలదీశారు. జీవిత నియామకంపై రాష్ట్ర పార్టీకి సమాచారం లేదని, ఆమెకు పదవి ఎలా వచ్చిందో తమకు తెలియదని రాష్ట్రపార్టీ బాధ్యులు ఆ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకోసం దశాబ్దాల తరబడి చాకిరీ చేస్తున్నవారిలో చాలామందికి దిక్కూదివాణం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని అవకాశంగా తీసుకుని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు చర్యలేమీ తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎంతో దూకుడుగా ఉన్నదని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తప్ప మరే పార్టీకి మనుగడ లేకుండా చేయాలనే దూరదృష్టితో పనిచేస్తున్నా బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాల్లో దీటుగా ఎదుర్కోవాలనే యోచన లేదని విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఎదురొడ్డి పోరాడేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. అధికారపార్టీపై పోరాటం చేయడానికి అవసరమైన ఆయుధాలను ఇవ్వకుండా, ఆ పార్టీపై పోరాడెదెలా అని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.