చిటారుకొమ్మన పదవీ పొట్లం
సాక్షి ప్రతినిధి, కడప: నామినేటెడ్ పదవులు అధికారపార్టీ నేతల్ని ఊరిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచే ఏదో ఒక పదవి చేజిక్కించుకోవాలని జిల్లా నేతలు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేశాం, ఈమారైనా గుర్తింపు దక్కుతుందనే ఆశాభావంతో పలువురు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నేరుగా అధిష్టానానికి చెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం టీడీపీలో లేకపోవడంతో నాయకులు సందిగ్ధంలో పడ్డారు.
పూర్వపు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అగ్రస్థానం ఉండేది. ప్రస్తుతం టీడీపీలో పదవులు దక్కించుకోవడం ఆశామాషీ వ్యవహరం కాదనే ఆపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఓవైపు పోటీదారులను ఎదుర్కొవడమే కాకుండా అంచెలంచెలుగా నాయకుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆపార్టీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు.
పార్టీ ఉన్నతి కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నాయకుల్ని కాదని పైరవీకారులకు అగ్రస్థానం దక్కుతోందన్న ఆందోళన తెలుగుతమ్ముళ్లుల్లో అధికమైంది. ఈక్రమంలో క్రమశిక్షణగా మెలిగిన నాయకులను పదవులు వరిస్తాయా? అన్న సందేహం నేతల్లో ఎక్కువైంది.
ఎమ్మెల్సీ రేసులో ఆ ఇద్దరు...
జిల్లాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే తమను దాటిపోదని జిల్లా అధ్యక్షుడు ఎం లింగారెడ్డి, రైల్వేకోడూరు ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథనాయుడు ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీకోసం కష్టపడ్డ నాయకులకే పదవులు అని స్వయం గా అధినేత చంద్రబాబు చెప్పినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకోసం టికెట్‌ను త్యాగం చేసిన లింగారెడ్డికి ఎమ్మెల్సీ దక్కుతుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.
అవిశాంత్రంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమ నాయకుడుకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని రైల్వేకోడూరు ఇన్‌ఛార్జి విశ్వనాథనాయుడు వర్గీయులు పేర్కొం టున్నారు. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చాం. ఈమారు పదవి అప్పగిస్తే భవిష్యత్‌లో కేడర్‌ను సమీకరించుకుని పార్టీ ఉన్నతికి విశేషంగా పాటుపడే అవకాశం ఉందని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం భావిస్తోంది.
ఎమ్మెల్సీ పదవిపై వీరు ముగ్గురు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారిలో ఇరువురు నేతలకు ఆయా నియోజకవర్గాల నేతల నుంచి వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు పదవిని కట్టబెట్టి ఆ దుకోవాలని ఓటమి చెందిన నాయకుల నుంచి కూడా అభ్యర్థనలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. అలాంటి వారిలో జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి పట్ల మాత్రమే సీఎం కొంత సానుకూల దృక్పదంతో ఉన్నట్లు సమాచారం.
కనీస గుర్తింపు కోసం ఆరాటం...
వ్యక్తిగత బలబలాలు ఎలా ఉన్నా, పదవి దక్కించుకనేందుకు పోటీ పడుతోన్న నేతల జాబితా పెద్దగానే ఉంది. ఇప్పటికే మైదుకూరు, రాజంపేట, రాయచోటి, సిద్ధవటం మార్కెట్ కమిటీ ఛైర్మన్ స్థానాలను భర్తీ చేశారు. ప్రధానమైన కడప, ప్రొద్దుటూరుతో పాటు పులివెందుల స్థానాలను భర్తీ చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కొరవడడమే కారణం.
ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి పదవుల్ని జిల్లా నేతలకు అప్పగించి పార్టీని బలోపేతం చేయాలనే తలంపు కన్పించడం లేదనే భావనలో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి అందులోనే పుట్టిపెరిగిన నాయకుల్ని పరిగణలోకి తీసుకొనే పరిస్థితులు సైతం కన్పించడం లేదనే ఆవేదన ఆపార్టీ శ్రేణుల్లో కన్పిస్తోంది. పెపైచ్చు జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, దానిని భర్తీ చేయాలనే తలంపు ప్రధాన నాయకుల్లో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు.