పైరవీలు
- నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల పోటీ
- అధినేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నం
- తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్న సిద్ధు
- సిద్ధమవుతున్న రెండు జాబితాలు
- 10న అంతిమంగా ఒక జాబితా వెలువడే అవకాశం!
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. ఆశావహులు అటు కేపీసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇటు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ‘కృష్ణ’ చుట్టూ అధినాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయినా కూడా ఇప్పటికీ వివిధ మండళ్లు, బోర్డు అధ్యక్ష పదవులు తదితర నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. ఈ పదవులపై ఆ పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది నాయకులు కన్నేశారు.
అయితే ఆశావహులకు సంబంధించి ‘కేపీసీసీ’ కార్యాలయంలో ఒక జాబితా, ‘కృష్ణ’లో మరో జాబితా సిద్ధమవుతోంది. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నవారు మొదట కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలోదరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను పార్టీ బ్లాక్ స్థాయి అధ్యక్షుడితో పాటు జిలా ఇన్‌చార్జ్ మంత్రి పరిశీలించి కేపీసీసీ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తయింది. కేపీసీసీకి చేరిన దరఖాస్తులను పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు మరికొంత మంది ముఖ్యమైన పదాధికారులు పరిశీలిస్తూ జాబితాను తయారు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు మహిళలకు ‘కేపీసీసీ’ పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మరోవైపు నామినేటెడ్ పదవులపై కన్నేసిన వారి నుంచి సిద్ధరామయ్య నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 2013 శాసనసభ, అటుపై వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసి కూడా ఓటమి పాలయిన వారు, ఆశావహుల స్థానికత, అక్కడి ప్రతిపక్షాల బలాబలాలు, తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ ‘కృష్ణ’లో మరో జాబితా సిద్ధమవుతోంది. దీంతో అటు కేపీసీసీతో పాటు ఇటు కృష్ణ చుట్టూ కూడా ఆశావహులు చక్కర్లు కొడుతూ అధినాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా, కృష్ణలో తయారవుతున్న జాబితాలో సీఎం సిద్ధరామయ్య తన అనుచరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య, పరమేశ్వర్‌ల మధ్య ఈ నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై గతంలోనే ఒకసారి గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అలా జరగకుండా సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే ఇరువురు నాయకులకు పార్టీ హై కమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై ఇరువురు నాయకులు కలిసి చర్చించి అంతిమంగా ఒక నిర్ణయానికి రానున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 10న నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన వ్యక్తుల మొదటి జాబితా విడుదలవుతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.