KPCC
-
మోదీ గుజరాత్ బిడ్డయితే.. కన్నడ బిడ్డను నేను
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఘనవిజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. శనివారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కింది. కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. కన్నడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది. తొలి కేబినెట్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కర్ణాటక మాదిరిగానే ఇతర స్టేట్స్‌లోనూ కాంగ్రెస్‌ను గెలిపిస్తాం అని అన్నారాయన. నేను గుజరాత్ బిడ్డనని మోదీ పదే పదే చెప్తుంటారు. మోదీ గుజరాత్ బిడ్డయితే నేను కన్నడ బిడ్డను.. రైతు బిడ్డను. మోదీ సహా కేంద్రమంత్రులంతా వచ్చి కర్ణాటకలో ప్రచారం చేసినా.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని, అందుకు కృతజ్ఞతలని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీంపై మా కేబినెట్ తొలి సంతకం చేస్తుంది. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు జేసింది. మోదీ పదిసార్లు రోడ్‌షోలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం. 2024 కూడా ఇదే విజయాన్ని సాధిస్తాం. రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కర్ణాటక ప్రజలందరిదీ. కాంగ్రెస్‌ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర కలిసొచ్చింది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యదే విజయం కాదు. ఇది కర్ణాటక ప్రజల విజయం. రేపు(ఆదివారం) సాయంత్రం సీఎల్పీ సమావేశం ఉంటుంది అని తెలిపారు. Live : ಜಂಟಿ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿ, ಕೆಪಿಸಿಸಿ ಕಚೇರಿ. https://t.co/vwUf4mQ9RK — Karnataka Congress (@INCKarnataka) May 13, 2023 -
రాజకీయాలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు : రాజకీయాలపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సదాశివనగర్‌లోని తన ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో మోసం చేయటం అన్నది సర్వసాధారణ విషయం. నేను, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. అన్ని పార్టీలు ఇందుకు ఉదాహరణ. మేము బీజేపీ నుంచి ప్రతాప్ గౌడ పాటిల్‌ను పార్టీలో చేర్చుకున్నాము. వేరే పార్టీలోకి పోవటం వెనక్కు రావటం రాజకీయాల్లో మామూలే. పార్టీలోని ఒక్కోరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కానీ, వ్యక్తిగత అభిప్రాయాలకంటే పార్టీ అభిప్రాయాలు ఎంతో ముఖ్యం. పార్టీ వీడిన 17 మంది, అందులో మంత్రి పదవులు పొందిన వారు ఎవ్వరూ పార్టీని సంప్రదించలేదు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని వీడి బీజేపీలోకి వెళ్లిన 17 మంది మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చిన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకుని పార్టీలో చేరొచ్చు. అన్ని అప్లికేషన్లు పరిశీలించి పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ’’ అని పేర్కొన్నారు. -
రాసలీలల సీడీ కేసు: రమేశ్‌ని అరెస్టు చేయాలి
బనశంకరి: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని సీడీ కేసులో అరెస్టు చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులోనే హోంమంత్రి బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని, కేసు వెనుక ఉన్న అందరి పాత్రలు తేలేందుకు స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కేసులో అనేక అవకతవకలు జరిగాయని పలు ఉదాహరణలను వివరించారు. రేప్ కేసులో నిందితున్ని అరెస్టు చేయకపోవడం ఇక్కడ మాత్రమే చూస్తున్నామని, సిట్ అధిపతి సౌమేందు ముఖర్జీని సెలవుపై పంపించారని సిద్ధరామయ్య ఆరోపించారు. చదవండి: రాసలీలల సీడీ కేసు అవును.. ఆమె తెలుసు..! -
శివకుమార్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం కేసు నమోదు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో శివకుమార్‌కు చెందిన 14 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.57 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు చెందిన రెండు నివాసాల్లోనూ(బెంగళూరు, ఢిల్లీ) సోదాలు నిర్వహించారు. డీకే శివకుమార్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు రూ.74.93 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇవన్నీ ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని చెబుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఏడు నెలల క్రితం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతంలోనే డీకే శివకుమార్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. కర్ణాటకలో నవంబర్ 3వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బతీయడానికే డీకే శివకుమార్‌పై కేసు పెట్టారని విమర్శించింది. మోదీ, యడ్యూరప్ప ద్వయం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. డీకే శివకుమార్ సీబీఐకి సహకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి హితవు పలికారు. రూ.వందల కోట్ల ఆస్తులను అతి తక్కువ కాలంలో ఎలా ఆర్జించారో చెప్పాలన్నారు. -
అధిష్టానానికి తలనొప్పిగా ఆ రాష్ట్ర వ్యవహారం
సాక్షి,బెంగళూరు: కేపీసీసీ అధ్యక్ష పీఠం కోసం నేతల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు కేపీసీసీ పదవి కేటాయిస్తారని అనుకుంటుండగా మాజీ సీఎం సిద్దరామయ్య సామాజిక అడ్డంకులను సాకుగా చూపించడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇటు సిద్ధును, అటు డీకేశిని కాదనలేక అధిష్టానం మదనపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్‌కు కేపీసీసీ చీఫ్ పదవి ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా చెప్పడంతో అందుకు అంగీకరించిన సిద్ధు రాష్ట్రంలో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని నలుగురికి కేపీసీసీ కార్యాధ్యక్ష పదవులు ఇవ్వాలని కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడం ద్వారా తన మద్దతుదారులకు పదవులు ఇప్పించే పావులు కదుపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మైనార్టీ నాయకుడు, మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌ను లేదా యూటీ ఖాదర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సతీశ్ జార్కిహోళి, లింగాయత్ వర్గానికి చెందిన ఈశ్వర్ ఖండ్రే, ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన ఆంజనేయ లేదా ధృవనారాయణలను ఎంపిక చేయాలని డిమాండ్ పెట్టారు. అయితే నలుగురికి ఇవ్వడం కష్టమని, ఇద్దరికి మాత్రమే ఇస్తామని అధిష్టానం చెప్పినా సిద్ధరామయ్య నిరాకరించారు. నలుగురు కార్యాధ్యక్షుల నియామకానికి మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొందరు సీనియర్లు వ్యతిరేకించారు. పార్టీ బలోపేతానికి తన నిర్ణయం అధిష్టానం ముందు ఉంచానని, తుది నిర్ణయం రావాల్సి ఉందని సిద్ధు తన సహచరుల వద్ద చెప్పినట్లు సమాచారం. -
‘కర్ణాటక కాంగ్రెస్’ రద్దు
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, సంకీర్ణ ప్రభుత్వంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తుల వల్ల కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రద్దు చేసింది. కేవలం అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తప్ప మిగిలిన వారిని తొలగిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 చోట్ల పోటీ చేస్తే కేవలం ఒక్క సీటును మాత్రమే గెలవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూ రావు అన్నారు. పార్టీ చీఫ్‌గా తాను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్ ఖండ్రే కలసి పార్టీని పునర్వ్యవస్థీకరించి, బలపరచాల్సి ఉందన్నారు. నిజాయితీతో పని చేసేవారికే... పార్టీలో నూతన కార్యవర్గానికి అవకాశం కల్పిస్తామని, నిజాయితీగా పనిచేస్తూ పార్టీకి విధేయులుగా ఉండే వారికే అవకాశం ఇస్తామని దినేశ్ స్పష్టం చేశారు. 280 మందిని తొలగించి అదే స్థాయిలో నాయకులను నియమించే అవకాశం ఉంది. నిజం చెబితే తొలగిస్తారా ? లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయానికి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ దినేశ్ వంటి కొందరు నేతలే కారణమంటూ కాంగ్రెస్ మైనార్టీ నేత రోషన్ బేగ్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో ఏఐసీసీ ఆయనను కాంగ్రెస్ నుంచి తొలగించింది. నిజాలు మాట్లాడితే తొలగిస్తారా ? నాపై చర్యలు తీసుకున్నారు సరే.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వాళ్లపై చర్యలు లేవా అంటూ మండిపడ్డారు. -
కర్ణాటక పీసీసీని రద్దు చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం తన కర్ణాటక రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసింది. అయితే, కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిండెంట్లను మాత్రం కొనసాగిస్తున్నామని, వారి విషయంలో మార్పు ఉండబోదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కర్ణాకటలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర లుకలుకలు ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం విశేషం. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను ఆ పార్టీ సస్పెండ్‌చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ చతికిలపడటంపై రోషన్ బేగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇందుకు పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యనే కారణమని నిందించారు. కేపీపీసీ చీఫ్ దినేశ్ గుండురావు అవివేకం వల్లే పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఫలితాల్ని చవిచూసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు పడింది. మరోవైపు సిద్దరామయ్య, దినేశ్ గుండురావు తీరు పట్ల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్నారని వినిపిస్తోంది. ఈ పరిణామాల నడుమ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం చాలా బాధ కలిగిస్తోందని, కూటమిలోని విభేదాలు చక్కదిద్దేందుకు సీఎంగా తాను ప్రయత్నిస్తున్నానని కుమారస్వామి చెప్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకుడిపై సస్పెన్షన్ వేటు
బెంగళూరు : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను సీనియర్ నాయకుడు రోషన్ బేగ్‌ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) నాయకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రోషన్ బేగ్ మీద చర్యలు తీసుకోవాలంటూ కేపీసీసీ పంపిన నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు’ ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రోషన్ బేగ్ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కర్ణాకటలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో రోనేష్ బేగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దినేశ్ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ జోకర్ అని రోషన్ బేగ్ తిట్టిపోశారు. ఇదే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఏ జ్యువెల్స్ స్కామ్‌లో రోషన్ బేగ్ భాగస్వామి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. -
కేంద్రమంత్రి భార్యకు డీఎన్ఏ పరీక్ష చేయాలి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు భార్య ఏ మతంవారని ప్రశ్నించిన కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ మండిపడ్డారు. హెగ్డే భార్య ఏ కులం వారో తెలుసుకోవటానికి డీఎన్ఏ పరీక్ష చేయించాలన్నారు. సోమవారం నగర కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ ద్వారా ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన ఆయన హిందూ మహిళలను ముట్టుకొన్నవారి చేతులు కత్తిరించాలని అనంత్‌కుమార్ హెగ్డే చెప్పారని, ఆయన ఎంతమంది చేతులు కత్తిరించారో చెప్పాలని ప్రశ్నించారు. కేపీసీసీ ప్రచార సమితి రాష్ట్రాధ్యక్షుడు హెచ్.కే.పాటిల్ మాట్లాడుతూ గాంధీజీ ఫోటోను బొమ్మ తుపాకీతో కాల్చిన పూజా శకుల్పాండేను అరెస్టు చేయని పక్షంలో దేశ వ్యాప్తంగా పోరాటం చేపడతామన్నారు. కేపీసీసీ కార్యధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రె మాట్లాడుతూ గాంధీజీ బొమ్మను తుపాకీతో కాల్చినవారు దేశద్రోహులని మండిపడ్డారు. అనంత్‌కుమార్ హెగ్డేను తక్షణమే మంత్రి మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆనంద్‌రావు సర్కిల్ వరకు పాదయాత్రగా తరలి గాంధీ విగ్రహానికి మాలార్పణం చేశారు. ఆ తరువాత మహిళా కాంగ్రెస్ నేతలు పూజా శకుల్పాండెపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
లిప్‌స్టిక్, స్లీవ్‌లెస్ వద్దు!
శివాజీనగర (బెంగళూరు): రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తాజాగా ఎంపికైన పుష్ప అమర్నాథ్.. బాధ్యతలు స్వీకరించకముందే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. మహిళా అధ్యక్షురాలిగా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఆ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలకు ఆమె డ్రెస్ కోడ్ పెట్టారు. విధిగా చీరలే ధరించాలని, అవీ నీలిరంగువే అయి ఉండాలని నిర్దేశించారు. అలాగే, లిప్‌స్టిక్ వేసుకోకూడదని, మేకప్ అవసరం లేదని, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించరాదని నిషేధం విధించారు. చక్కగా చీర కట్టుకొని మెడ వరకు బ్లౌజ్ ధరించాలని సూచించారు. కొత్త మేడమ్ ఆదేశాలపై కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. -
పైరవీలు
- నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల పోటీ - అధినేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నం - తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్న సిద్ధు - సిద్ధమవుతున్న రెండు జాబితాలు - 10న అంతిమంగా ఒక జాబితా వెలువడే అవకాశం! సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. ఆశావహులు అటు కేపీసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇటు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ‘కృష్ణ’ చుట్టూ అధినాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయినా కూడా ఇప్పటికీ వివిధ మండళ్లు, బోర్డు అధ్యక్ష పదవులు తదితర నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. ఈ పదవులపై ఆ పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది నాయకులు కన్నేశారు. అయితే ఆశావహులకు సంబంధించి ‘కేపీసీసీ’ కార్యాలయంలో ఒక జాబితా, ‘కృష్ణ’లో మరో జాబితా సిద్ధమవుతోంది. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నవారు మొదట కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలోదరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను పార్టీ బ్లాక్ స్థాయి అధ్యక్షుడితో పాటు జిలా ఇన్చార్జ్ మంత్రి పరిశీలించి కేపీసీసీ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తయింది. కేపీసీసీకి చేరిన దరఖాస్తులను పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు మరికొంత మంది ముఖ్యమైన పదాధికారులు పరిశీలిస్తూ జాబితాను తయారు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు మహిళలకు ‘కేపీసీసీ’ పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోవైపు నామినేటెడ్ పదవులపై కన్నేసిన వారి నుంచి సిద్ధరామయ్య నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 2013 శాసనసభ, అటుపై వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసి కూడా ఓటమి పాలయిన వారు, ఆశావహుల స్థానికత, అక్కడి ప్రతిపక్షాల బలాబలాలు, తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ ‘కృష్ణ’లో మరో జాబితా సిద్ధమవుతోంది. దీంతో అటు కేపీసీసీతో పాటు ఇటు కృష్ణ చుట్టూ కూడా ఆశావహులు చక్కర్లు కొడుతూ అధినాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా, కృష్ణలో తయారవుతున్న జాబితాలో సీఎం సిద్ధరామయ్య తన అనుచరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య, పరమేశ్వర్ల మధ్య ఈ నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై గతంలోనే ఒకసారి గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అలా జరగకుండా సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే ఇరువురు నాయకులకు పార్టీ హై కమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై ఇరువురు నాయకులు కలిసి చర్చించి అంతిమంగా ఒక నిర్ణయానికి రానున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 10న నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన వ్యక్తుల మొదటి జాబితా విడుదలవుతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
పదవుల లొల్లి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అధికార పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. రాష్ర్టంలోని బోర్డులు, కార్పొరేషన్ల డెరైక్టర్లు, చైర్మన్ల నియామకాలను 15 రోజుల్లోగా చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన సీఎంతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రులు డీకే. శివ కుమార్, కేజే. జార్జ్ ప్రభృతులు పాల్గొన్నారు. కార్పొరేషన్లు, బోర్డుల నియామకాల్లో 30 శాతం పదవులను ఎమ్మెల్యేలకు, మిగిలిన 70 శాతం పదవులను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు కేటాయించాలని నిర్ణయించారు. మంత్రి వర్గ విస్తరణే తప్ప పునర్వ్యవస్థీకరణ వద్దని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయమైంది. ఆశావహుల జాబితాతో ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్, సీఎంతో పాటు పరమేశ్వరను ఆహ్వానించారు. కాగా పార్టీ, పాలన వ్యవహారాల్లో ఉమ్మడి నిర్ణయాలే తప్ప ఏకపక్ష నిర్ణయాలు తగవని దిగ్విజయ్ సూచించినట్లు సమాచారం. మోడీ ప్రభంజనం ఆగిపోయింది దేశంలో మోడీ ప్రభంజనానికి కాలం చెల్లిందని ఉప ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ర్టంలో ఉప ఎన్నికలు జరిగిన మూడింట్లో రెండింటిని తమ పార్టీ సునాయాసంగా గెలుచుకుందని, ఒక స్థానంలో గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. ఇందుకు గాను ఆయా నియోజక వర్గాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలు ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిన అంశాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో జరగాల్సి ఉన్నందున, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా నిర్ణయించామని తెలిపారు. బూత్ స్థాయిలో బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు చేరువ కావాలని కూడా తీర్మానించామని ఆయన చెప్పారు. కార్యాలయం వద్ద సందడి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్న కేపీసీసీ కార్యాలయం వద్ద మంత్రి పదవుల ఆశావహులు బల ప్రదర్శనకు దిగారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ మద్దతుదారుల చేత డిమాండ్ చేయించారు. ఎమ్మెల్యేలు ఆర్వీ. దేవరాజ్, మాలికయ్య గుత్తేదార్, బసవరాజ్ పాటిల్‌ల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తమ నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కొందరు మద్దతుదారులు టపాకాయలు పేల్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ సందీప్ పాటిల్ నేతృత్వంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.