సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అధికార పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. రాష్ర్టంలోని బోర్డులు, కార్పొరేషన్ల డెరైక్టర్లు, చైర్మన్ల నియామకాలను 15 రోజుల్లోగా చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన సీఎంతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రులు డీకే.
శివ కుమార్, కేజే. జార్జ్ ప్రభృతులు పాల్గొన్నారు. కార్పొరేషన్లు, బోర్డుల నియామకాల్లో 30 శాతం పదవులను ఎమ్మెల్యేలకు, మిగిలిన 70 శాతం పదవులను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు కేటాయించాలని నిర్ణయించారు. మంత్రి వర్గ విస్తరణే తప్ప పునర్వ్యవస్థీకరణ వద్దని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయమైంది. ఆశావహుల జాబితాతో ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్, సీఎంతో పాటు పరమేశ్వరను ఆహ్వానించారు. కాగా పార్టీ, పాలన వ్యవహారాల్లో ఉమ్మడి నిర్ణయాలే తప్ప ఏకపక్ష నిర్ణయాలు తగవని దిగ్విజయ్ సూచించినట్లు సమాచారం.
మోడీ ప్రభంజనం ఆగిపోయింది
దేశంలో మోడీ ప్రభంజనానికి కాలం చెల్లిందని ఉప ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ర్టంలో ఉప ఎన్నికలు జరిగిన మూడింట్లో రెండింటిని తమ పార్టీ సునాయాసంగా గెలుచుకుందని, ఒక స్థానంలో గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. ఇందుకు గాను ఆయా నియోజక వర్గాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలు ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిన అంశాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో జరగాల్సి ఉన్నందున, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా నిర్ణయించామని తెలిపారు. బూత్ స్థాయిలో బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు చేరువ కావాలని కూడా తీర్మానించామని ఆయన చెప్పారు.
కార్యాలయం వద్ద సందడి
సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్న కేపీసీసీ కార్యాలయం వద్ద మంత్రి పదవుల ఆశావహులు బల ప్రదర్శనకు దిగారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ మద్దతుదారుల చేత డిమాండ్ చేయించారు. ఎమ్మెల్యేలు ఆర్‌వీ. దేవరాజ్, మాలికయ్య గుత్తేదార్, బసవరాజ్ పాటిల్‌ల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తమ నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కొందరు మద్దతుదారులు టపాకాయలు పేల్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ సందీప్ పాటిల్ నేతృత్వంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
పదవుల లొల్లి
Published Wed, Aug 27 2014 4:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement