న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం తన కర్ణాటక రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసింది. అయితే, కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిండెంట్‌లను మాత్రం కొనసాగిస్తున్నామని, వారి విషయంలో మార్పు ఉండబోదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కర్ణాకటలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర లుకలుకలు ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం విశేషం.
ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను ఆ పార్టీ సస్పెండ్‌చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ చతికిలపడటంపై రోషన్ బేగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇందుకు పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యనే కారణమని నిందించారు. కేపీపీసీ చీఫ్ దినేశ్ గుండురావు అవివేకం వల్లే పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఫలితాల్ని చవిచూసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు పడింది. మరోవైపు సిద్దరామయ్య, దినేశ్ గుండురావు తీరు పట్ల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్నారని వినిపిస్తోంది. ఈ పరిణామాల నడుమ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం చాలా బాధ కలిగిస్తోందని, కూటమిలోని విభేదాలు చక్కదిద్దేందుకు సీఎంగా తాను ప్రయత్నిస్తున్నానని కుమారస్వామి చెప్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment