Karnataka Pradesh Congress Committee
-
నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే సోదరులకు ఈడీ సమన్లు
బనశంకరి: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు పిలిచారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేసిన యంగ్ ఇండియా ట్రస్ట్‌కు డీకే సోదరులు చెక్ ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ సమన్లపై శివకుమార్ స్పందించారు. ఈడీకి తనపై చాలా ప్రేమ ఉందని, అందుకే పదేపదే సమన్లు పంపిస్తోందని అన్నారు. ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో తాను తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉందని, విచారణకు హాజరు కావడానికి మరో గడువు ఇవ్వాలని కోరుతూ ఈడీకి మెయిల్ చేశామని చెప్పారు. -
ఈడీ ముందుకు కేపీసీసీ చీఫ్ శివకుమార్
సాక్షి బెంగళూరు: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(60) సోమవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణకు రావాలంటూ గురువారం డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శివకుమార్ వైద్యులతో పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో 30 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. రూ.75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై 2020లో సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన రెండో మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ప్రశ్నించింది. -
కర్ణాటక పీసీసీని రద్దు చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం తన కర్ణాటక రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసింది. అయితే, కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిండెంట్లను మాత్రం కొనసాగిస్తున్నామని, వారి విషయంలో మార్పు ఉండబోదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కర్ణాకటలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర లుకలుకలు ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం విశేషం. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను ఆ పార్టీ సస్పెండ్‌చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ చతికిలపడటంపై రోషన్ బేగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇందుకు పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యనే కారణమని నిందించారు. కేపీపీసీ చీఫ్ దినేశ్ గుండురావు అవివేకం వల్లే పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఫలితాల్ని చవిచూసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు పడింది. మరోవైపు సిద్దరామయ్య, దినేశ్ గుండురావు తీరు పట్ల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్నారని వినిపిస్తోంది. ఈ పరిణామాల నడుమ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం చాలా బాధ కలిగిస్తోందని, కూటమిలోని విభేదాలు చక్కదిద్దేందుకు సీఎంగా తాను ప్రయత్నిస్తున్నానని కుమారస్వామి చెప్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
‘కేపీసీ చీఫ్‌గా చెబుతున్నా...’
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరిన తరుణంలో సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. నూతన బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయంలో సిద్థరామయ్య, కుమారస్వామిల మధ్య భేదాభిప్రాయాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తనకు పదవి దక్కడాన్ని ఉద్దేశించి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై కుమార స్వామి... ‘ఎవరి దయ వల్లనో నేను సీఎం కాలేదంటూ’ కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం ప్రకృతి వైద్యశాలలో చేరిన సిద్ధరామయ్య మరోసారి సంకీర్ణ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమేనంటూ సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసేంత వరకైతే(2019) కర్ణాటక ప్రభుత్వానికి ఢోకా లేదని.. కానీ తర్వాత కచ్చితంగా మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన తెలిపారు. ఐదేళ్లపాటు కొనసాగుతుంది... సిద్ధరామయ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో డిప్యూటీ సీఎం, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జి.పరమేశ్వర వివరణ ఇచ్చారు. విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆ వీడియో నేను చూడలేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నపుడే ఐదేళ్లపాటు కొనసాగించాలని ఒక ఒప్పందానికి వచ్చాం. కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వం ఐదేళ్లపాటు కచ్చితంగా కొనసాగుతుందంటూ’ స్పష్టం చేశారు. అయితే.. మరి సీఎం, మాజీ సీఎంల మధ్య విభేదాల సంగతేంటి అంటూ విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో... ‘మీరెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే. అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు. కానీ కర్ణాటక ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఇవి గాలి మాటలు కావు. కేపీసీ చీఫ్‌గా అధికారికంగా చెబుతున్నా’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
... ఆ పదవికి నేనూ అర్హుడినే
రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్ష స్థానాన్ని చేపట్టడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ పేర్కొన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. పార్టీ హై కమాండ్ ఆదేశిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి కేపీసీసీ అధ్యక్ష పదవిని చేపడతానన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్ వర్గం వారికి కేపీసీసీ పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ నేపథ్యంలోనే తనతోపాటు అప్పాజీ నాడగౌడ, ఎం.బీ పాటిల్, ప్రకాశ్ హుక్కేరి తదితర పేర్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు కేటాయించిన ఐఐటీ స్థాపనకు అన్ని జిల్లాల నుంచి డిమాండ్ ఉందన్నారు. అయితే ఐఐటీ స్థాపనకు కనిష్టంగా 400 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. అందువల్ల అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐటీ రంగంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే కర్ణాటకకు పోటీ అన్నారు. పొరుగు రాష్ట్రాలు ఈ విషయంలో కర్ణాటక దరిదాపుల్లో కూడా లేవని తెలిపారు. అందువల్ల కర్ణాటక నుంచి ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెలుతున్నాయన్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో బాగల్‌కోటే జిల్లాకు మాత్రమే నూతన ఐటీ పార్కు కేటాయించే అవకాశం ఉందన్నారు. బెంగళూరు తప్ప రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రాంతంలోనైనా కంపెనీ స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహిక పెట్టుబడుదారులకు ఉచితంగా భూమిని మంజూరు చేయనున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో కర్ణాటక నుంచి ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను నాలుగులక్షల కోట్ల రుపాయలకు చేర్చే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.1.80 లక్షల కోట్లుగా ఉందని మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు. -
తూతూ మంత్రంగా కాంగ్రెస్ ఆత్మావలోకనం
ముఖ్యమంత్రి సిద్ధు గైర్హాజర్ నేడు నగరానికి దిగ్విజయ్‌సింగ్ సాక్షి, బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆత్మావలోకన సభ తూతూ మంత్రంగా జరిగింది. ఈ సభకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గైర్హాజర్ కావడమే ఇందుకు కారణం. రాష్ర్టంలో అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కంటే తక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై చర్చించేందుకు ఆత్మావలోకన సభ పేరిట బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఓ సభను నిర్వహించింది. గత వారమే ఈ సభ జరగాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరిక మేరకు సభను గురువారానికి వాయిదా వేశారు. అయినా ఆయన ఈ సభకు గైర్హాజరు కావడంపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల సీఎంకు పార్టీపై ఎంతటి గౌరవం ఉందో అర్థమవుతోందని వారు విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించడంతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించాల్సిన ముఖ్యమైన సమావేశానికి సీఎం గైర్హాజరు కావడం పార్టీలోని విభేదాలకు నిదర్శంగా నిలిచింది. కాగా, సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు కొంతమంది జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నేడు నగరానికి దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నగరానికి రానున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వస్తున్న ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మరికొందరు ముఖ్యనేతలతో కూడా భేటీ కానున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగే అవకాాశం ఉంది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన కొంతమంది అభ్యర్థులు తమ ఓటమికి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎలా తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారన్న విషయంపై తయారు చేసిన నివేదికను దిగ్విజయ్‌సింగ్‌కు ఇవ్వడానికి సమాయత్తమవుతున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాగా, లోక్‌సభ ఎన్నికలు వెలువడిన తర్వాత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి.