రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్
బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్ష స్థానాన్ని చేపట్టడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ పేర్కొన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. పార్టీ హై కమాండ్ ఆదేశిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి కేపీసీసీ అధ్యక్ష పదవిని చేపడతానన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్ వర్గం వారికి కేపీసీసీ పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ నేపథ్యంలోనే తనతోపాటు అప్పాజీ నాడగౌడ, ఎం.బీ పాటిల్, ప్రకాశ్ హుక్కేరి తదితర పేర్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటకకు కేటాయించిన ఐఐటీ స్థాపనకు అన్ని జిల్లాల నుంచి డిమాండ్ ఉందన్నారు. అయితే ఐఐటీ స్థాపనకు కనిష్టంగా 400 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. అందువల్ల అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఐటీ రంగంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే కర్ణాటకకు పోటీ అన్నారు. పొరుగు రాష్ట్రాలు ఈ విషయంలో కర్ణాటక దరిదాపుల్లో కూడా లేవని తెలిపారు. అందువల్ల కర్ణాటక నుంచి ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెలుతున్నాయన్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో బాగల్‌కోటే జిల్లాకు మాత్రమే నూతన ఐటీ పార్కు కేటాయించే అవకాశం ఉందన్నారు. బెంగళూరు తప్ప రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రాంతంలోనైనా కంపెనీ స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహిక పెట్టుబడుదారులకు ఉచితంగా భూమిని మంజూరు చేయనున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో కర్ణాటక నుంచి ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను నాలుగులక్షల కోట్ల రుపాయలకు చేర్చే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.1.80 లక్షల కోట్లుగా ఉందని మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు.
... ఆ పదవికి నేనూ అర్హుడినే
Published Fri, Mar 13 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement