పార్లమెంట్‌లో కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి..
మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టుపై రూ.8,044.31 కోట్ల విలువైన పనులు
కానీ, బాబు శ్వేతపత్రంలో రూ.4,167 కోట్లే గత ప్రభుత్వం ఖర్చుచేసిందంటూ అవాస్తవాలు
టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానం
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ సర్కారు చేసిన ఖర్చు విషయంలో సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం బోగస్ అని తేలిపోయింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గురువారం పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. గత మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వ్యయం తెలియజేయాల్సిందిగా టీడీపీ ఎంపీలు కృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.
గత మూడేళ్లలో (2020–21, 2022–23, 2023–24) సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై రూ.8,044.31 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి చెప్పారు. ఇందులో రూ.4,227.52 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసిందని.. రూ.3,816.79 కోట్లు ఇంకా రీయింబర్స్ చేయాల్సి ఉందన్నారు. అయితే, చంద్రబాబునాయుడు గత నెల 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.4,167 కోట్లే వ్యయం చేసిందని అవాస్తవాలను వల్లెవేశారు.
బాబు అబద్ధాలను పటాపంచలు చేస్తూ టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి వాస్తవ అంకెలను వివరించారు. కేంద్ర నిధులు మళ్లించినట్లు కూడా చంద్రబాబు తన శ్వేతపత్రం ద్వారా చెప్పగా కేంద్రమంత్రి ఎక్కడా నిధుల మళ్లింపు ఊసెత్తలేదు. ఇక గత మూడేళ్లలో హెడ్‌వర్క్‌తో పాటు కాంక్రీట్ పనులు, కుడికాలువకు లైనింగ్ పనులు, ఎడమ కాలువ ఎర్త్‌వర్క్ లైనింగ్‌తో పాటు స్ట్రక్చర్ పనులు, భూసేకరణ, సహాయ పునరావాసానికి వ్యయం చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment