కర్ణాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య (పాత ఫొటో)
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరిన తరుణంలో సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. నూతన బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయంలో సిద్థరామయ్య, కుమారస్వామిల మధ్య భేదాభిప్రాయాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తనకు పదవి దక్కడాన్ని ఉద్దేశించి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై కుమార స్వామి... ‘ఎవరి దయ వల్లనో నేను సీఎం కాలేదంటూ’ కాస్త ఘాటుగానే స్పందించారు.
ప్రస్తుతం చికిత్స నిమిత్తం ప్రకృతి వైద్యశాలలో చేరిన సిద్ధరామయ్య మరోసారి సంకీర్ణ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమేనంటూ సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసేంత వరకైతే(2019) కర్ణాటక ప్రభుత్వానికి ఢోకా లేదని.. కానీ తర్వాత కచ్చితంగా మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన తెలిపారు.
ఐదేళ్లపాటు కొనసాగుతుంది...
సిద్ధరామయ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో డిప్యూటీ సీఎం, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జి.పరమేశ్వర వివరణ ఇచ్చారు. విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆ వీడియో నేను చూడలేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నపుడే ఐదేళ్లపాటు కొనసాగించాలని ఒక ఒప్పందానికి వచ్చాం. కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వం ఐదేళ్లపాటు కచ్చితంగా కొనసాగుతుందంటూ’ స్పష్టం చేశారు. అయితే.. మరి సీఎం, మాజీ సీఎంల మధ్య విభేదాల సంగతేంటి అంటూ విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో... ‘మీరెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే. అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు. కానీ కర్ణాటక ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఇవి గాలి మాటలు కావు. కేపీసీ చీఫ్‌గా అధికారికంగా చెబుతున్నా’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment