బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జేడీఎస్ కార్యకర్తలను వ్యభిచారులతో పోల్చి వివాదం సృష్టించారు సిద్ధరామయ్య. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే మూలకారకుడంటూ జేడీఎస్ కార్యకర్తలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ విలేకరి దీని గురించి సిద్ధరామయ్యను ప్రశ్నించాడు. దానికి ఆయన మండిపడుతూ.. జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘డాన్స్ రాని వ్యభిచారి.. వేదిక నృత్యం చేయడానికి అనుకూలంగా లేదని చెప్తుంది. అలానే జేడీఎస్ కార్యకర్తలు తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య మండి పడ్డారు.
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ అధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం 14 నెలల తర్వాత ఈ ఏడాది జూలైలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. నాటి నుంచి జేడీఎస్ శ్రేణులు సిద్ధరామయ్య మీద విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం కుమారస్వామి కూడా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని కుమారస్వామి మండిపడ్డారు.
(చదవండి: నా తొలి శత్రువు సిద్ధరామయ్య)
Comments
Please login to add a commentAdd a comment