సాక్షి, బెంగళూరు: మాజీ సీఎంలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఏకంగా 63 మందిని ఓ క్షణంలోనైనా చంపేస్తామనడం కర్నాటకలో సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలకు చంపేస్తామంటూ గుర్తు వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. మరో 61 మంది రచయితలకు కూడా ఇదే తరహా లేఖలు అందాయి. అయితే, ఈ లేఖలు ఎవరు పంపించారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ వారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అని రాసి ఉండడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
అయితే, లేఖలో వీరందరూ ఓ వర్గం పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి' అని రాసి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ లేఖ అందినవారిలో సీనియర్ కన్నడ రచయిత కుమ్ వీరభద్రప్ప (కుంవీ) కూడా ఉన్నారు.
ఈ లేఖపై మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స‍్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని తెలిపారు. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే తగిన భద్రత కల్పించాలని కోరారు. లేఖల విషయంలో తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment