బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇలానే వ్యవహరిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. సిద్దరామయ్య తమ నాయకుడని, ఆయనే సీఎం కావాలని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కుమారస్వామి స్పందించారు. ‘వీటన్నిటిని కాంగ్రెస్ నాయకులు గమనిస్తున్నారు. నాకు సంబంధంలేని విషయం ఇది. వారు ఇలానే చేస్తానంటే నా పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. వారు హద్దులు దాటుతున్నారు. కాంగ్రెస్ నేతలే తమ ఎమ్మెల్యేలను అదుపుచేయాలి’ అని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంపై కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం జి పరమేశ్వర స్పందిస్తూ.. ‘సిద్దరామయ్య గొప్ప సీఎం. ఆయన మా సీఎల్పీ నేత. సిద్దరామయ్య సీఎం అయితే బాగుండని ఓ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో తప్పేముంది. మేం ముఖ్యమంత్రి కుమారస్వామితో బాగానే ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు. ఇక కుమారస్వామితో తమకెలాంటి ఇబ్బంది లేదని, మీడియానే అతిగా ప్రవర్తిస్తుందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ మీడియా మందు అనవసర విషయాలు మాట్లాడవద్దని, హైకమాండ్, పార్టీని ఇబ్బంది పెట్టే విషయాలు ప్రస్తావించవద్దని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత మల్లిఖార్జున ఖార్గే సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment