మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను రూ.237.64 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో వివిధ పనులకోసం అవసరమైన నిధుల కోసం పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ క్రమంలో ఇటీవల శ్రీరాంపూర్‌కు విచ్చేసిన సీఎం తాను ప్రజల తరుపున కోరిన పలు డిమాండ్లను వెంటనే అంగీకరించి, నిధులను విడుదల చేస్తూ బుధవారం జీవో నంబర్ 170ని విడుదల చేశారని తెలిపారు. మంచిర్యాల గోదావరి నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించారని తెలిపారు.
ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంచిర్యాల నుంచి బసంత్‌నగర్ వరకు 23 కిలోమీటర్లు తగ్గుతుందన్నారు. దీనివల్ల ఇక్కడి ప్రాంత ప్రజలకు దూరభారంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని చెప్పారు. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ థియేటర్ నుంచి హైటెక్‌సిటీ కాలనీ, హమాలివాడ మీదుగా తోళ్లవాగు వరకు గల బైపాస్ రహదారికి వెళ్లేందుకు హైటెక్‌సిటీ కాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌పై ఆర్‌వోబీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.77.64 కోట్లు కేటాయించారని తెలిపారు. పట్టణంలోని ఐబీ నుంచి బొక్కలగుట్ట (క్యాతన్‌పల్లి) వరకు ఏడు కిలోమీటర్లు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.35 కోట్లు విడుదల చేయడంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్‌రావు చిత్రపటాలకు టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్‌చైర్మన్ నల్ల శంకర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ అత్తి సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి వెంకటేశ్వర్‌రావు, మాజీ చైర్మన్ పెంట రాజయ్య, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కార్యదర్శి పెండ్లి అంజయ్య, యూత్ అధ్యక్షుడు రాకేశ్, బీసీ సెల్ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్, నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment