తొలి అడుగు | government given permission to new district | Sakshi
Sakshi News home page

తొలి అడుగు

Published Fri, Sep 12 2014 12:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

తొలి అడుగు - Sakshi

తొలి అడుగు

శ్రీరాంపూర్/మంచిర్యాల టౌన్/మంచిర్యాల : ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు మొదటి అడుగు పడింది. ఇన్నాళ్లు రాజకీయ ప్రకటనలకే పరిమితమైన జిల్లా ఏర్పాటుకు గురువారం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో తూర్పు వాసుల కల నెరవేరనుంది. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న పది జిల్లాలతో కలిపి మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని పొందుపరి చింది. అందులో మంచిర్యాల మొదటిదిగా పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత పలుమార్లు సభల్లో కేసీఆర్ 24 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రస్తావించారు.
 
గురువారం తాజాగా మొదటి దశలో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యపేట, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ కొత్త జిల్లాలుగా ఉన్నాయి. ఈ ఏడు జిల్లాల ఏర్పాటుకు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)ను ఆదేశించారు. ఇది కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎంతో కీలక నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అధికారికంగా కొత్త జిల్లాల కసరత్తును ప్రభుత్వం మొదలు పెట్టింది.
 
అనువైన ప్రాంతం
మంచిర్యాలలో జిల్లాకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రైలు, బస్సు మార్గాలు జిల్లాలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయబడి ఉండటం, జాతీయ రహదారి కూడా జిల్లా ఏర్పాటయ్యే తూర్పు ప్రాంత మీదుగా ఉండటం కలిసొచ్చే అంశంగా పేర్కొనవచ్చు. ఒక పక్క సింగరేణి, మరోపక్క వ్యవసాయ రంగం, సిమెంటు, సిరామిక్స్ కంపెనీలు ఉండటం, వాణిజ్యం, వ్యాపారం రంగాల్లో కూడా పెద్దపెద్ద పట్టణాలకు తీసిపోని విధంగా మంచిర్యాల విస్తరించింది. వీటిన్నింటికంటే ముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తూర్పు ప్రాంతానికి ఏమాత్రం అందుబాటు దూరంలో లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పరిపాలన సౌలభ్యం కోసం శాస్త్రీయంగా కూడా మంచిర్యాల జిల్లా ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వ గుర్తించింది.
 
జిల్లా కేంద్రం కంటే హైదరాబాదే నయం
వేమనపల్లి మండలవాసులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 280 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సమానదూరం జిల్లా కేంద్రం ఉండటం మూలంగా ఆయా పనుల మీద వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు వెళ్లడం కంటే రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌కు వెళ్లడం ఎంతో మేలు. జిల్లా కేంద్రంకు ఏదైన పనుల మీద వెళ్లాలంటే సామాన్యులకు పెను భారంగా మారింది.
 
పాలనా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాల్లో పనుల నిమిత్తం ఇక్కడి నుంచి వెళ్ళే అధికారులు, ఉద్యోగులతోపాటు కలెక్టర్‌కు అర్జీలు సమర్పించుకొనే వారికి దూరం ప్రధాన సమస్యగా మారింది. వివిధ  రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, ఉద్యోగాల ఎంపిక కోసం వెళ్లే అభ్యర్థులతోపాటు ఇతర పనుల మీద జిల్లా కేంద్రానికి వెళ్లే వారందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
తూర్పుకు మంచిర్యాలే ముఖచిత్రం
తూర్పు జిల్లాకు మంచిర్యాలనే ముఖ చిత్రంగా చెప్పుకోవచ్చు. 1905లో ఆదిలాబాద్ జిల్లా ఏర్పడింది. 1940 వరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. జిల్లా విస్తీర్ణం 16,128 కిలో మీటర్లు కాగా జనాభా దాదాపు 30 లక్షలకు పైగా ఉంది. జిల్లాలోని 52 మండలాల్లో 26 మండలాలు తూర్పు జిల్లాలోనే ఉన్నాయి. జన్నారం నుంచి సిర్పూర్ వరకు ఉన్న ఈ మండలాలకు మంచిర్యాల నడిబొడ్డున ఉంటుంది. అయితే జిల్లా కేంద్రం ఆదిలాబాద్ భౌగోళికంగా ఉత్తర ంగా ఈ ప్రాంతానికి సుదూరంలో ఉంది.
 
తూర్పు జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, పశ్చిమ జిల్లా పరిధిలో మరో ఐదు నియోజకవర్గాలున్నాయి. తూర్పు జిల్లాలో అటవీ సంపద విస్తారంగా ఉంది. బొగ్గు, సున్నపురాయి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మంచిర్యాల నుంచి ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్, జైపూర్, లక్నో ప్రాంతాలకు వెళ్లడానికి రైలు సదుపాయం ఉంది. వ్యాపార, వాణిజ్య పరంగా, మౌలిక వసతులు పరంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవల రాష్ట ముఖ్యమంత్రి మంచిర్యాలను పోలీసు కమిషనరేట్ ప్రకటన కూడా కొంత ఆజ్యం పోస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement