మెదక్, న్యూస్‌లైన్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు అంశం తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ప్రత్యేక జిల్లాపై ఈ ప్రాంతవాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుత మెదక్ జిల్లాలోని మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మెదక్ కేంద్రంగా ఏర్పడే జిల్లా లో మెదక్‌తోపాటు ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ ప్రాంతాలను కలిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
చరిత్రలోకి వెళితే...
కాకతీయుల ఖిల్లాగా... మొఘల్ చక్రవర్తుల రాజమహల్‌గా మెదక్ పట్టణం పేరుగాం చింది. అప్పట్లో నాలుగు జిల్లాలకు సుభాగా విరాజిల్లింది. మెదక్, అత్రాఫ్-ఇ-బల్దియా(హైదరాబాద్), మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు మెదక్ సుభా పరిధిలో ఉండేవి. కానీ 1932లో ఆనాటి నవాబులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉంటుందన్న ఏకైక కారణంతో వెయ్యి జనాభా కూడా లేని సంగారెడ్డి ఠమొదటిపేజీ తరువాయి
పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. అప్పట్లోనే 12 వేల జనాభా గల మెదక్ పట్టణ చరిత్ర మసకబారుతూ వచ్చింది.
57 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం..
జిల్లా కేంద్రం విషయంలో మెదక్ పట్టణం నాటి పాలకుల అవకాశవాద వైఖరి వల్ల అనాదిగా దగా పడుతోంది. 1957లో సంఘ సేవకుడు రామదాసు మెదక్ జిల్లా కేంద్రం కోసం 43 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కళా వెంకట్రావు మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. అనంతరం మెదక్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో మెదక్ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని ఆమె ఇచ్చిన హామీ కూడా నెరవేరకుండానే పోయింది. ఆపై జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో 2010 అక్టోబర్ 14 నుంచి 57 రోజులపాటు రిలే దీక్షలు చేపట్టి, లక్ష సంతకాలు సేకరించి అప్పటి ముఖ్యమంత్రికి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కూడా వినతిపత్రాలు సమర్పించారు. జిల్లాకు కావాల్సిన అన్ని భౌగోళిక, రాజకీయ చరిత్ర ఉందని, అందువల్ల మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో ప్రతి గణతంత్ర దినోత్సవం మెదక్ నియోజకవర్గ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి, చారిత్రక ఖిల్లాపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడుతుందన్న సంకేతాలు అందుతుండడంతో ఈ ప్రాంతంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక జిల్లాపై చిగురిస్తున్న ఆశలు
Published Sun, May 11 2014 11:10 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement