సభలో మాట్లాడుతున్న లక్ష్మణ్, వేదికపై నాయకులు
మంచిర్యాలసిటీ: తెలంగాణ రాష్ట్రంలో నచ్చిన వారికి నజరానాలు, నచ్చని వారికి జరిమానాలు విధించే విధంగా తుగ్లక్ పాలన నడుస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ చేపట్టిన మార్పు కోసం జన చైతన్య యాత్ర మంగళవారం మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్‌బీహెచ్‌వీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌కు ఎన్నికల తర్వాత అది నచ్చలేదన్నారు. అందుకే ఆయనే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడని విమర్శించారు. తన కుటుంబసభ్యులకు మరో నాలుగు పదవులు కట్టబెట్టారని, అంతా ఆ నలుగురిదే రాజ్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు 20వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. అందులో 12వేల పోస్టులు పోలీసు ఉద్యోగాలేనని పేర్కొన్నారు.
కేసీఆర్ పరిపాలనతో నిరుద్యోగులు, రైతులు, యువత తిరగబడితే వారి గొంతు నొక్కడానికి, హక్కులను కాలరాయడానికే పోలీసు ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు, వారి కుటుంబాలు వీధినపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగం అనే పదం ఉండదని ప్రకటించిన కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎందుకు రెగ్యులర్ చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగుపడుతారని అన్నారు. కానీ ఆ వర్గాలు బాగుపడడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు. 40 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి దొరికేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఎకరాలు మాత్రమే పంచితే మిగతా దళిత కుటుంబాలు ఎలా బతకాలని నిలదీశారు. డ్రైవరు కొడుకైనా, మంత్రి కొడుకైనా ప్రభుత్వ బడిలోనే చదవాలని, అందుకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ మనవడు ఏ బడిలో చదువుతున్నాడో, డ్రైవర్ బాలయ్య కొడుకు ఏ బడిలో చదువుతున్నాడో చెప్పాలని సవాల్ విసిరారు. కమీషన్ల కోసమే సాగునీరు, తాగునీరు పేరిట మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఊరికో బెల్టుషాపు పెట్టించి వచ్చిన ఆదాయంతో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని గొప్పగా కేసీఆర్ చెప్పుకుంటున్నాడని దుయ్యబట్టారు.
బొందలగడ్డగా సింగరేణి..
సింగరేణిలో ఓపెన్ కాస్ట్‌లు ఉండవని ఉద్యమంలో ప్రకటించిన కేసీఆర్ నేడు కొత్తగా 11 గనుల ప్రారంభానికి అనుమతించారన్నారు. తద్వారా సింగరేణి ప్రాంతాలను బొందల గడ్డగా మార్చనున్నారని ధ్వజమెత్తారు. చెన్నూర్‌లో భూగర్భ గనుల నిర్మాణానికి అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు ప్రారంబించడం లేదన్నారు. అక్కడ భూగర్భ గనులు ప్రారంభిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందన్నారు. సర్వ రోగాల నివారణకు జిందా తిలస్మాత్ అన్నుట్టుగా రైతు సమస్యలు పరిష్కరించకుండా రైతుబంధు పథకంతో మోసపుచ్చుతున్నాడని విమర్శించారు. కౌలురైతులను అపహాస్యం చేస్తున్న కేసీఆర్‌కు వారి గోస తగులుతుందన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న అడవిబిడ్దలను ఎందుకు గుర్తించడం లేదన్నారు.
వారు తెలంగాణ బిడ్డలు కాదా అని ప్రశ్నించారు. రేషన్ డీలర్లకు కేంద్రం ఇచ్చే కమీషన్ ఇస్తే వారు ఈ రోజు సమ్మెలోకి వెళ్లే వారు కాదన్నారు. సాక్షర్ భారత్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వకుండా, ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా వారిని ఇబ్బందుల పాలుచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పెరుగన్నం తినే రైతు తెలంగాణ ఏర్పడ్డాక పురుగుల మందు తాగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సచివాలయానికే రాని వ్యక్తి దేశ రాజకీయాలను ఏలుతానంటే ఎవరైనా కేసీఆర్‌ను నమ్ముతారా అని ప్రశ్నించారు.
నిధులిచ్చినా నిందలు...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారాం మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని బద్‌నాం చేస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నేషనల్ హైవే, రైలుమార్గాలు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వంటి వాటికి తమ ప్రభుత్వం వేలకోట్ల నిధులు ఇచ్చినప్పటికీ కేసీఆర్ తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని అవమానిస్తున్నాడని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్‌రావు మంచిర్యాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని మల్లారెడ్డి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment