ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నాతో 18 సంవత్సరాల అనుబంధాన్ని మరిచిపోయి.. మంత్రి హరీశ్‌రావు తన మామ కేసీఆర్ మెప్పు పొందడానికి ఆరాటపడుతున్నారు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో హరీశ్‌రావు మామ కేసీఆర్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. గురువారం ఈటల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్‌రావు ఎంత ఆరాటపడ్డా కేసీఆర్ నమ్మరని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరో 11 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న తాను.. తన శాఖ నుంచే ముఖ్యమంత్రికి జీతం ఇచ్చానని.. అలాంటి తాను నియోజకవర్గ అభివృద్ధిని ఎలా విస్మరిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడుసార్లు మంత్రులతో కలసి ప్రగతి భవన్‌కు వెళ్తే కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు. 2003లో తనకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్నో తేల్చేందుకు సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అదే సమయంలో ‘మీ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమా’అని నిలదీశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాకుండా మిగతా ఎక్కడా 2 వేలకు పైగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు లేవని, అవి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు పూర్తి చేశారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా కర్రు కాల్చి వాతపెట్టారో.. హుజూరాబాద్‌లో కూడా అలాగే చేస్తారని హెచ్చరించారు.
సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఆ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని చెప్పానని వెల్లడించారు. హుజూరాబాద్, జమ్మికుంటలను అద్దంలా మార్చాలని రూ.25 కోట్ల చొప్పున జీవో తెస్తే, కేటీఆర్ నిధులు ఆపారని పేర్కొన్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిసలకు నిలయమని రాసుకోమని ఎంపీ సంతోష్‌కుమార్‌కు చెప్పానని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment