ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా? | Minister Harish Rao Serious Comments On Etela Rajender | Sakshi
Sakshi News home page

ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా?

Published Sun, Sep 26 2021 2:09 AM | Last Updated on Sun, Sep 26 2021 2:09 AM

Minister Harish Rao Serious Comments On Etela Rajender - Sakshi

సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో కౌశిక్‌రెడ్డి, సబితారెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్‌ తదితరులు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రజలు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్‌ ప్రజలను ఈటల రాజేందర్‌ తన మాటలతో అవమానించాడని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌బాబు, రాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌లో రూ.కోటి వ్యయంతో చేపట్టిన రెడ్డి కమ్యూనిటీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో ఈ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం టీఆర్‌ఎస్‌లో ఉండి ఇటీవల పార్టీ మారిన ఈటల రాజేందర్, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఏంటని మండిపడ్డారు.

ఇది ముమ్మాటికీ హుజూరాబాద్‌ ప్రజలను అవమానించడమేనని స్పష్టంచేశారు. బీజేపీ పంచన చేరిన ఈటల, చేతనైతే తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలు విసిరారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హరీశ్‌ హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. 

రెడ్డిలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు: గెల్లు  
చిన్నప్పటి నుంచి తమ కుటుంబానికి రెడ్డి సామాజికవర్గంతో అనుబంధం ఉందని హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తమ గ్రామంలో రెడ్డి సామాజికవర్గం నాయకుల సహకారంతోనే తన తల్లి సర్పంచ్‌గా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తనను మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. తాను గెలిస్తే పేద ఓసీలకు డబుల్‌ బెడ్రూంలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. 

కేసీఆర్‌ది రైతుసంక్షేమ ప్రభుత్వం: పోచారం
సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ సభకు స్పీకర్‌ హోదాలో రాలేదని అన్నారు. కొంతకాలంగా తమ సామాజికవర్గంలో పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం సామాజికసేవలో ముందుండే రెడ్లు తప్పకుండా పేర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవు: నిరంజన్‌రెడ్డి
45 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం రైతులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రైతువేదికలు తదితర రైతు సంక్షేమ పథకాలు గుజరాత్‌లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 

మహిళలకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి 
తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల కష్టాలు తాము స్వయంగా చూశామని మంత్రి సబితారెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నారని, బాలికల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 50 శాతం రిజర్వేషన్‌ తెచ్చారని, నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్‌ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement