హమ్మాయ్యా! టెన్షన్‌ పోయింది.. కేసీఆర్‌ హామీతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం | Karimnagar Sitting MLAs Full Happy After CM KCR Declaration On MLA Tickets | Sakshi
Sakshi News home page

హమ్మాయ్యా! టెన్షన్‌ పోయింది.. సీఎం కేసీఆర్‌ హామీతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం

Published Tue, Sep 6 2022 2:56 PM | Last Updated on Tue, Sep 6 2022 3:05 PM

Karimnagar Sitting MLAs Full Happy After CM KCR Declaration On MLA Tickets - Sakshi

సాక్ష, కరీంనగర్‌: ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా.. ఇప్పటికే నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో మమేకమయ్యే వారికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టికెట్ల విషయంలో బెంగ వద్దు, మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చడం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు.. తప్పదంటే ఓ నాలుగైదు సీట్లు మార్చాల్సి వస్తదేమో’ అంటూ సీఎం కేసీఆర్‌ ఈనెల 3న తెలంగాణ భవన్‌లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేయడంతో తాజా ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతుండగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి నెలకొంటున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ పాతవారికే టికెట్లు, పెద్దగా మార్పులేమి ఉండవంటూ ఇచ్చిన హామీతో కార్యకర్తల్లో నయా జోష్‌ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి, బలబలాలు, విజయావకాశాలపై కొన్నాళ్లుగా ప్రశాంత్‌కిషోర్‌(పీకే) టీం సభ్యుల రకరకాల నివేదికలు అధిష్టానానికి అందాయనే ఊహగానాల నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మంథనిలో కాంగ్రెస్‌ నుంచి శ్రీధర్‌బాబు, హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సీఎం హామీతో మిగతా 11 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో వారి అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న చోటామోటా నేతలంతా తమకు మొండిచేయి తప్పదనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్‌ నుంచి నామినేటెడ్‌ పదవి ఆశిస్తున్న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ లాంటి ఆశావహులు గులాబీ బాస్‌ ప్రకటనతో డీలాపడ్డారు.

కరీంనగర్‌ జిల్లా!
కరీంనగర్‌: కరీంనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్‌ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ, 2014–2018లో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కించుకుని, 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
చొప్పదండి: 2018లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సుంకె రవిశంకర్‌ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎం హామీతో ఈయనకు రెండోసారి బెర్త్‌ ఖరారైంది.
మానకొండూరు: సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 2014 నుంచి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా ఇతన్నే అధిష్టానం బరిలో దించనుంది.
హుస్నాబాద్‌: 2014 నుంచి ఇక్కడ వొడితెల సతీశ్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఇక్కడ ఇతనే పోటీలోకి దిగుతారు.
హుజురాబాద్‌: గతంలో ఇక్కడ టీఆరెఎస్‌ ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్‌ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయనపై గులాబీ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ పోటీ చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా!
సిరిసిల్ల: సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా 2004 నుంచి కేటీఆర్‌ విజయపరంపర కొనసాగిస్తున్నారు. 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన వైవిధ్యత, ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
వేములవాడ: 2009 నుంచి ఇక్కడ చెన్నమనేని రమేశ్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్‌ భారతీయ పౌరుడు కాదంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ ఈయనపై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా!
ధర్మపురి: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఉన్న కొప్పుల ఈ శ్వర్‌ «2014 «నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని వేసిన కేసు న్యాయస్థానంలో నడుస్తోంది.
జగిత్యాల: ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ 2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో అతడిపైనే సంజయ్‌ విజయం సాధించారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఆయనకే టికెట్‌ దక్కనుంది. 
కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009 నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అధిష్టానం ఇతనికే టికెట్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయినా, ఈసారి ఇతని తరఫున ఆయన కుమారుడు సంజయ్‌ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది.

పెద్దపల్లి జిల్లా!
పెద్దపల్లి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి 2014 నుంచి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది.
రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 2018లో ఏఐఎఫ్‌బీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటిపై ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కొలువుల స్కాంలో విమర్శలు వచ్చాయి.
మంథని: పుట్ట మధుకర్‌ ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సంచలనం రేపిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement