సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల విషయంలో కేటీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొన్నం మాట్లాడుతూ.. కరీంనగర్, నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాంటి కాంగ్రెస్, బీజేపీలు ఎన్నటికి కలవవని పొన్నం తెలిపారు. టీఆర్‌ఎస్, బీజేపీల దోస్తానాపై తమ వద్ద ఆధారాలున్నాయని, ఇరు పార్టీలు కలిసి డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎన్నటికైనా కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను బెదిరించి తమ నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి తెస్తున్నారని, పోటీ చేసి గెలవకుండా ఎందుకు బయపడుతున్నారంటూ ప్రశ్నించారు.
ప్రతిపక్షాల తరపున ఎవరైనా పోటీ చేస్తామని ముందుకు వస్తే వారింట్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులను బదిలీలు చేస్తామని బెదిరించడం దారుణమని వెల్లడించారు.11 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న గంగుల కమలాకర్ కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పాలని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలకు 24 గంటలు నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగనని చెప్పిన కమలాకర్ మళ్లీ ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారంటూ విమర్శించారు.బీజేపీ ఎంపీ బండి సంజయ్ మతపరంగా రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో మాకు అభ్యర్థులు దొరకడం లేదంటున్నారని పొన్నం తెలిపారు.
కానీ వాస్తవానికి అన్ని డివిజన్లలో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు లేనిది బీజేపీకేనన్న విషయం ఎంపీగారికి తెలియదునుకుంటా.. అందుకే ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మేయర్, ఎమ్మెల్యే మధ్య గొడవతో కరీంనగర్‌లో అభివృద్ధి ఆగిపోయిందని , మమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్‌లోని రెండు సీట్లకు తాము సీపీఐకి మద్దతిస్తున్నట్లు పొన్నం స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment