సిరిసిల్లలో దళితబంధు లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: ఆర్థికంగా అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతోనే దళితబంధు అమలవుతోందని, మన రాష్ట్రంలో ఇది విజయవంతమైతే దేశం మనవైపు చూస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రూ.17,500 కోట్లతో దళితబంధు పథకాన్ని అమలు చే స్తున్నారని తెలిపారు.
లబ్ధిదారులు స్వయం ఉపాధితోపాటు పది మందికి పనికల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ దళితులు దేశానికి దిక్సూచిలా మారాలన్నారు. 75 ఏళ్లలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారన్నారు. కేసీఆర్ 1987–88 ప్రాంతంలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండగా.. దళిత చైతన్య జ్యోతి పథకాన్ని ప్రారంభించి దళితులను చైతన్యవంతులను చేశారని గుర్తుచేశారు. తెలంగాణ చిన్న రాష్ట్రం అయినా ఎంతో అభివృద్ధి సాధించి దేశానికి మార్గదర్శి అయిందన్నారు. సీఎం కేసీఆర్ అంటే పరివర్తనకు, మార్పునకు చిహ్నమన్నారు.
రాజ్యాంగాన్ని రక్షించాల్సిందే.. కానీ..
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో ఏకీభవిస్తున్నానని, కానీ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కేం ద్రం అరాచకపాలన సాగిస్తోందని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడు తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచం అబ్బురపడేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.
దళిత పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు రూ.200 కోట్లతో 3 వేల మందికి టీప్రైడ్ ద్వారా రాయితీలు అందించినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గమని, సంపదను సృష్టించి పది మందికి పంచగలిగితే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని అన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు.
దళితులతో సహపంక్తి భోజనం
సిరిసిల్లలో రూ.2.5 కోట్లతో నిర్మించిన అంబేడ్కర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. దళితబంధు లబ్ధిదారుల తో సహపంక్తి భోజనం చేశారు. అం తకుముందు తంగళ్లపల్లిలో అంబేడ్కర్ భవ నానికి భూమి పూజ చేశారు. సారంపల్లి, మల్లాపూర్, లక్ష్మీపూర్, అంకుసాపూర్ గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే సిరిసిల్లలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment