విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈటల
హుజూరాబాద్: ‘నా ముఖం అసెంబ్లీలో కనిపించవద్దని.. రాష్ట్రంలో పరిపాలన పక్కన పెట్టి, హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను మంత్రి హరీశ్‌రావు అమలు చేస్తున్నారు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘అన్ని కులాల బంధువులారా మీకు జీవోల రూపంలో కేసీఆర్ కత్తి ఇస్తున్నారు. ఆ కత్తితో పేదల గొంతుక అయిన ఈటల రాజేందర్‌ను పొడిచి చంపమని చెపుతున్నారు.
నేను రాజీనామా చేసి 4 నెలల 22 రోజులు అయింది. అప్ప టి నుంచి హుజూరాబాద్‌లో వందల సంఖ్యలో టీఆర్‌ఎస్ నాయకులు మోహరించి, ప్రజాస్వా మ్యం అపహాస్యం అయ్యేలా పని చేస్తున్నారు’అని విమర్శించారు. కేసీఆర్‌కు కలలో కూడా హుజూరాబాదే కనిపిస్తోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక నాయకులకు దావత్‌లు ఇచ్చి.. స్వయంగా వారే వడ్డిస్తున్నారని, మందు పోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నాయకుల కొనుగోళ్లకి రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు.
ఇతర పార్టీల వారిని వేధించి, బెదిరించి టీఆర్‌ఎస్ కండువాలు కప్పుతున్నారని, ప్రజాస్వామ్య వాదులు దీనిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సంఘాలకు భవనాలు, గుడులు కట్టిస్తాం అని జీవోలు ఇస్తున్నారని.. శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇవన్నీ ప్రజల మీద ప్రేమతో ఇవ్వడం లేదని, ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ‘దళితుల మీద ప్రేమతో దళితబంధు రాలే.. మీ ఓట్ల మీద ప్రేమతో వచ్చింది.
నిజంగా ప్రేమ ఉంటే మొత్తం రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు’అని ప్రశ్నించారు. రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందని.. ఆర్థిక మంత్రి దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని అన్నారు. నిరుద్యోగుల చావులకు కారణమై వాళ్ల ఉసురు పోసుకుంటున్నారని.. ఉద్యోగాల మీద దృష్టి పెట్టకుండా హుజూరాబాద్ ఎన్నిక మీదనే ఫోకస్ చేశారని విమర్శించారు. పరాభవం తప్పదని అర్థమై, సీఎం కేసీఆర్ ఎన్నిక వాయిదా కోరారని ఆరోపించారు.
భూములు అమ్మితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ధ్వజమెత్తారు. హరీశ్ ఇక్కడ కుట్రలో భాగస్వామిగా మారి, ఆర్థిక శాఖ ఎటు పోయిందో పట్టించుకోవడం లేదన్నారు. ‘2 గుంటలున్న వ్యక్తికి.. 200 ఎకరాలు ఉన్న ఆసామికి జరుగుతున్న ఎన్నిక ఇది.. అంటున్నారు. మరి 2 గుంటలు ఉన్న వ్యక్తి ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారో హరీశ్ సమాధానం చెప్పాలి’అని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment