సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకునే కుట్రతోనే ఆగమేఘాల మీద ఒక రోజు ముందు 21న సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేశారని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. 21న అమిత్‌షా సభ కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వేచ్ఛగా గ్రామాల్లో తిరిగి జనసమీకరణ జరపకుండా ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేలు పోలీస్ ఎస్కార్ట్‌తో తిరుగుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మునుగోడులో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్ బీజేపీని అడ్డుకునేందుకు కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే ప్రక్రియ మొదలైందని, ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తూనే, సొంతపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సైతం వెల కడుతున్నారని అన్నారు.
మునుగోడులో హుజూరాబాద్ లాంటి తీర్పు ఇవ్వాలనే పట్టుదలతో జనం ఉన్నారని తెలిసి కేసీఆర్ కుట్రలకు దిగుతున్నారని విమర్శించారు. 21న బీజేపీ సభకు వెళ్లవద్దని దిగజారి ప్రచారం చేయడం జుగుప్సగా ఉందన్నారు. బీజేపీలో చేరేందుకు వచ్చే టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. తమ ఫోన్లు టాప్ చేస్తూ, తమతో మాట్లాడిన టీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. డీజీపీ, పోలీసులు కేసీఆర్‌కు బానిసలుగా పనిచేస్తున్నట్లుగా ఉందని, బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.
కాళేశ్వరానికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు..?
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కేసీఆర్ చెబుతు న్నారని.. వాస్తవం ఏంటో మంచిర్యాల ప్రజలను అడిగితే చెబుతారని ఈటల ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను బ్యారేజీల వద్దకు ఎందుకు పోనివ్వడం లేదని ప్రశ్నించారు.
చదవండి: కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?
Comments
Please login to add a commentAdd a comment