
నేడే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ
వరంగల్ శివారు ఎల్కతుర్తిలో భారీగా ఏర్పాట్లు
దేశం దృష్టిని ఆకర్షించేలా ఉంటుందన్న పార్టీ నేతలు
1,200 ఎకరాల్లో సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జనంలోకి కేసీఆర్
భవిష్యత్ పోరాటంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు శంఖారావం పూరించే చాన్స్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా.
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి.
దేశం దృష్టిని ఆకర్షించేలా..
14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్థానం సాగించిన బీఆర్‌ఎస్.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది.
ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
2024 మార్చి 31న తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది.
దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించే భవిష్యత్ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
విద్యుత్ వెలుగుల్లో సభా ప్రాంగణం
అట్టహాసంగా ఏర్పాట్లు
రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు.
వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
సభా వేదికపై 500 మంది..
సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.
ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్‌లో వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.
సభ ఏర్పాట్లు ఇలా
⇒ సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు
⇒ బీఆర్‌ఎస్ అంచనా ప్రకారం సభకు హాజరయ్యే ప్రజలు: సుమారు 10 లక్షలు
⇒ మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు
⇒ ప్రధాన వేదికపై సీటింగ్: 500 మందికి
⇒ సభా సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు.
⇒ వాహనాల పార్కింగ్ : 1,059 ఎకరాలు
⇒ సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్ బాటిళ్లు: 10.80 లక్షలు
⇒ మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు
⇒ సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు
⇒ మెడికల్ క్యాంపు: సభావేదిక చుట్టూ 12
⇒ ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు