the Left parties
-
వారివి హింసా రాజకీయాలు
న్యూఢిల్లీ: దేశంలో హింసా రాజకీయాలు వామపక్షాలకు అలవాటేనని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కేరళలో బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులపై వామపక్ష కార్యకర్తల దాడులకు నిరసనగా ‘జన్‌రక్షా యాత్ర’ ప్రారంభించిన షా..ఆదివారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి సీపీఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సదర్భంగా షా మీడియాతో మాట్లాడుతూ..‘ బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలను హతమారుస్తూ వామపక్షాల శ్రేణులు కేరళలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. మా కార్యకర్తలు శరీరాలను ఛిద్రం చేసి బీజేపీకి మద్దతు ఇచ్చేవారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాయి. వామపక్షాలు ఎంత ఎక్కువగా రక్తపాతానికి పాల్పడితే..బీజేపీ కేరళలో అంతగా విస్తరిస్తుంది’ అని తెలిపారు. రాజకీయ హింస అన్నది వామపక్షాలకు అలవాటేనని, పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు ఎక్కువకాలం అధికారంలో ఉండటమే ఆయా రాష్ట్రాల్లో తీవ్ర హింసకు కారణమని విమర్శించారు. మరోవైపు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ.. జన్‌రక్షా యాత్ర పేరిట బీజేపీ కేరళలో నిర్వహించిన ర్యాలీ ఫ్లాప్‌షోగా మారడంతో షా ఢిల్లీకి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. -
మియాపూర్ భూములపై 13న సీఎస్‌కు వినతి: లెఫ్ట్
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల వ్యవహారంపై ఈ నెల 13న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాన్ని సమర్పించాలని వివిధ వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. శనివారం ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లపై చర్చించారు. భువనగిరి జిల్లా పల్లెర్ల గ్రామంలో కుల దురహంకారంతో నరేశ్, స్వాతిలను హత్య చేయడంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు మెమోరాండం సమర్పించాలని, సానుకూల స్పందన రాక పోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని తీర్మానించాయి. విద్యారంగం–ఫీజుల నియంత్రణకు సంబంధించిన సమస్యలపై జిల్లాల్లో ఆందోళనలు, లెఫ్ట్, విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర సదస్సును ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో తమ్మినేని వీరభద్రం, డీజీ నర్సింహారావు (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి, ఎం.ఆదిరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకట్రామయ్య, రమ (న్యూ డెమోక్రసీ– రాయల), తాండ్రకుమార్, ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ– యూ), మురహరి (ఎస్‌యూసీఐ–సీ), జానకిరాములు, గోవింద్ (ఆర్ఎస్పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) పాల్గొన్నారు. -
నువ్వు హైదరాబాద్‌కు సీఎంవా.. తెలంగాణ రాష్ట్రానికా?
రాతి దేవుళ్ల చుట్టూ తిరగడం కాదు.. కార్మికుడేదేవుడని గుర్తించు తెలంగాణ సెంటిమెంట్ మీద ఇకపై నీ ఆటలు సాగనివ్వం సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తిన వామపక్ష నేతలు తమ్మినేని, చాడా నల్లగొండ నుంచి వామపక్షాల భరోసా బస్సు యాత్ర ప్రారంభం నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై ఎర్రజెండా నేతలు ధ్వజమెత్తారు. అసలు కేసీఆర్ హైదరాబాద్‌కే ముఖ్యమంత్రా.. లేక తెలంగాణ రాష్ట్రానికా? అని వామపక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, డ్వామా సిబ్బంది చేస్తున్న సమ్మెల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన భరోసా బస్సుయాత్ర సోమవారం నల్లగొండ నుంచి ర్యాలీతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నల్లగొండ క్లాక్‌టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కార్మికుల సమ్మెల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేసీఆర్ బుద్ధి పేదల పక్షమా.. ఉన్నోళ్ల పక్షమా? అనే ప్రశ్న తలెత్తుతోందని, హెలీకాప్టర్లలో తిరిగి 11వేల ఎకరాల భూములను పైసా ఖర్చు చేయకుండా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ కేవలం 1100 రూపాయల జీతం పెంచాలని అడుగుతున్న కార్మికులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.రాతిదేవుళ్ల చుట్టూ తిరుగుతూ కోట్ల నిధులు ప్రకటిస్తున్న కేసీఆర్ కార్మికుడే దేవుడు... పనే దేవత అనే విషయాన్ని గుర్తెరగడం లేదని తమ్మినేని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచకుండా తనకు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడాన్ని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి తప్పుబడతాడని, ఆయన మాటల్లో చెప్పలేకపోయినా, కలలో కనపడి అయినా చెపుతాడని ఎద్దేవా చేశారు. కార్మికుల సమ్మెల పట్ల సానుకూల వైఖరి తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్నం మొదటి బుక్కలోనే రాయి వచ్చినట్టు.. కేసీఆర్ ఏడాది పాలనలోనే అనేక అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆయనకు పార్టీ ఫిరాయింపుదారులపై ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికులపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గురించి పొగిడిన కేసీఆర్‌కు.. ఇప్పుడు వారే దెయ్యాలుగా కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నోటితో పెట్టి నొసటితో వెక్కిరించినట్టుగా కేసీఆర్ పాలన ఉందని, అసలు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఉన్న సీఎం దేశంలో ఒక్క కేసీఆరేనని ఆయన విమర్శించారు. -
మున్సిపల్ సమ్మెను అణచివేయలేరు
వామపక్ష నేతలు శంకర్, కాశీనాథ్ గాంధీనగర్ : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. కార్మికులు చేపట్టిన సమ్మెను అరెస్ట్‌లతో అణచివేయలేరన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి నాగభూషణరావు భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ విధానం సమస్య పరిష్కరించే విధంగా ఉండాలేగానీ రెచ్చగొట్టే విధంగా ఉండరాదన్నారు. నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు పచ్చచొక్కా కార్యకర్తలను తాత్కాలిక ఉద్యోగాలుగా తీసుకురావాలనే ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవన్నారు. ఆరు రోజులుగా సమ్మె చేస్తుండడంతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయిందన్నారు. పారిశుధ్యం లోపించి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. పదవ వేతన సంఘం ప్రకటించిన కనీసం వేతనమే కార్మికులు కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు పెంచుకోవడం చూపిన శ్రద్ధ కార్మికులపై చూపడం లేదన్నారు. నగర మేయర్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు యూవీ రామారాజు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పి.గౌతమ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు బి.సత్యనారాయణ. సీపీఐ నాయకులు సూర్యారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై ‘లెఫ్ట్’ కన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో తమ సానుభూతిపరులను బరిలోకి దింపాలని సీపీఐ, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలనే ఆలోచనతో ఉన్న వామపక్ష పార్టీలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. మేధావులైన వారిని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజకవర్గానికి జరిగే ఎన్నికల బరిలో దింపేందుకు తొలుత ప్రయత్నించాయి. రాజకీయ జేఏసీకి చెందిన ముఖ్యనేతలను పోటీకి దించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. దీంతో తమ సానుభూతిపరులను పోటీ చేయిం చాలని లెఫ్ట్ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జనార్దనరెడ్డి పేరును సీపీఎం ప్రతిపాదించినట్లు తెలిసింది. మరోవైపు సినీనేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ఒప్పించాలని సీపీఐ ప్రయత్నిస్తోంది. ఇక ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజక వర్గం నుంచి భోగా శ్రీనివాసరావు (క్రాంతి శ్రీనివాస్)ను పోటీ చేయించాలని సీపీఎం యత్నిస్తుండగా.. పార్టీ నేత బొమ్మగాని ప్రభాకర్‌ను బరిలోకి దింపాలని సీపీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పది వామపక్షాల సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, ఈ ప్రతిపాదనలపై మిగతాపార్టీల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఒకవైపు ఇరు పార్టీలు మెరుగైన సమన్వయం కోసం ప్రయత్నిస్తూ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటాపోటీగా అభ్యర్థులను ప్రతిపాదించడంపై విస్మయం వ్యక్తమైనట్లు తెలిసింది.