నువ్వు హైదరాబాద్‌కు సీఎంవా.. తెలంగాణ రాష్ట్రానికా?
రాతి దేవుళ్ల చుట్టూ తిరగడం కాదు.. కార్మికుడేదేవుడని గుర్తించు
తెలంగాణ సెంటిమెంట్ మీద ఇకపై నీ ఆటలు సాగనివ్వం
సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తిన వామపక్ష నేతలు తమ్మినేని, చాడా
నల్లగొండ నుంచి వామపక్షాల భరోసా బస్సు యాత్ర ప్రారంభం
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై ఎర్రజెండా నేతలు ధ్వజమెత్తారు. అసలు కేసీఆర్ హైదరాబాద్‌కే ముఖ్యమంత్రా.. లేక తెలంగాణ రాష్ట్రానికా? అని వామపక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, డ్వామా సిబ్బంది చేస్తున్న సమ్మెల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన భరోసా బస్సుయాత్ర సోమవారం నల్లగొండ నుంచి ర్యాలీతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నల్లగొండ క్లాక్‌టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కార్మికుల సమ్మెల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేసీఆర్ బుద్ధి పేదల పక్షమా.. ఉన్నోళ్ల పక్షమా? అనే ప్రశ్న తలెత్తుతోందని, హెలీకాప్టర్లలో తిరిగి 11వేల ఎకరాల భూములను పైసా ఖర్చు చేయకుండా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ కేవలం 1100 రూపాయల జీతం పెంచాలని అడుగుతున్న కార్మికులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.రాతిదేవుళ్ల చుట్టూ తిరుగుతూ కోట్ల నిధులు ప్రకటిస్తున్న కేసీఆర్ కార్మికుడే దేవుడు... పనే దేవత అనే విషయాన్ని గుర్తెరగడం లేదని తమ్మినేని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచకుండా తనకు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడాన్ని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి తప్పుబడతాడని, ఆయన మాటల్లో చెప్పలేకపోయినా, కలలో కనపడి అయినా చెపుతాడని ఎద్దేవా చేశారు. కార్మికుల సమ్మెల పట్ల సానుకూల వైఖరి తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్నం మొదటి బుక్కలోనే రాయి వచ్చినట్టు.. కేసీఆర్ ఏడాది పాలనలోనే అనేక అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆయనకు పార్టీ ఫిరాయింపుదారులపై ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికులపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గురించి పొగిడిన కేసీఆర్‌కు.. ఇప్పుడు వారే దెయ్యాలుగా కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నోటితో పెట్టి నొసటితో వెక్కిరించినట్టుగా కేసీఆర్ పాలన ఉందని, అసలు అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వకుండా ఉన్న సీఎం దేశంలో ఒక్క కేసీఆరేనని ఆయన విమర్శించారు.