న్యూఢిల్లీ: దేశంలో హింసా రాజకీయాలు వామపక్షాలకు అలవాటేనని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కేరళలో బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులపై వామపక్ష కార్యకర్తల దాడులకు నిరసనగా ‘జన్‌రక్షా యాత్ర’ ప్రారంభించిన షా..ఆదివారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి సీపీఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సదర్భంగా షా మీడియాతో మాట్లాడుతూ..‘ బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలను హతమారుస్తూ వామపక్షాల శ్రేణులు కేరళలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. మా కార్యకర్తలు శరీరాలను ఛిద్రం చేసి బీజేపీకి మద్దతు ఇచ్చేవారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాయి.
వామపక్షాలు ఎంత ఎక్కువగా రక్తపాతానికి పాల్పడితే..బీజేపీ కేరళలో అంతగా విస్తరిస్తుంది’ అని తెలిపారు. రాజకీయ హింస అన్నది వామపక్షాలకు అలవాటేనని, పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు ఎక్కువకాలం అధికారంలో ఉండటమే ఆయా రాష్ట్రాల్లో తీవ్ర హింసకు కారణమని విమర్శించారు. మరోవైపు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ.. జన్‌రక్షా యాత్ర పేరిట బీజేపీ కేరళలో నిర్వహించిన ర్యాలీ ఫ్లాప్‌షోగా మారడంతో షా ఢిల్లీకి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment