సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల వ్యవహారంపై ఈ నెల 13న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాన్ని సమర్పించాలని వివిధ వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. శనివారం ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లపై చర్చించారు. భువనగిరి జిల్లా పల్లెర్ల గ్రామంలో కుల దురహంకారంతో నరేశ్, స్వాతిలను హత్య చేయడంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు మెమోరాండం సమర్పించాలని, సానుకూల స్పందన రాక పోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని తీర్మానించాయి.
విద్యారంగం–ఫీజుల నియంత్రణకు సంబంధించిన సమస్యలపై జిల్లాల్లో ఆందోళనలు, లెఫ్ట్, విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర సదస్సును ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో తమ్మినేని వీరభద్రం, డీజీ నర్సింహారావు (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి, ఎం.ఆదిరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకట్రామయ్య, రమ (న్యూ డెమోక్రసీ– రాయల), తాండ్రకుమార్, ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ– యూ), మురహరి (ఎస్‌యూసీఐ–సీ), జానకిరాములు, గోవింద్ (ఆర్‌ఎస్‌పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) పాల్గొన్నారు.