ఏపీఎన్జీవో సంఘం అధ్యక్ష అభ్యర్థి అబ్దుల్ బషీర్
ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ర్టం కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంలతో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయడంలో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు విఫలమయ్యారని సంఘం అధ్యక్ష అభ్యర్థి ఎస్‌కే అబ్దుల్ బషీర్ ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు 64 రోజులపాటు పెద్దఎత్తున ఆందోళన చేపట్టినా అశోక్‌బాబు ఒంటెత్తు పోకడలవల్ల రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయలేకపోయామన్నారు. ఏపీఎన్జీవో సంఘం ఎన్నికల్లో భాగంగా ఓటర్లును కలిసేందుకు ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న పార్టీల్లో వైఎస్సార్‌సీపీ ముందుందన్నారు. ప్రజాభిమానం ఉన్న ఆ పార్టీని అశోక్‌బాబు ఉద్యమంలోకి ఆహ్వానించకపోవడంతో నేడు విభజన పక్రియ అసెంబ్లీ వరకు వచ్చిందన్నారు. హైదరాబాద్ సిటీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, సమైక్య ఉద్యమం ఎగసిపడుతున్న తరుణంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుచేయాలని అశోక్‌బాబుపై ఒత్తిడి తెచ్చినా ఏర్పాటుచేయలేదన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే మెరుపు సమ్మె చేస్తామని, దిగ్విజయ్‌సింగ్‌ను హైదరాబాద్‌లో కాలుపెట్టనీయబోమని ప్రగల్భాలు పలికిన ఆయన ఇప్పుడెందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.