పజాప్రతినిధుల ఇళ్లకు నీళ్లు, కరెంట్ కట్
సభ ముందుకు బిల్లు వస్తే అసెంబ్లీ ముట్టడి: అశోక్‌బాబు
తాము రాజకీయాలకు అతీతంగా ఉన్నందున రాజకీయ జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. గురువారం విజయవాడలో న్యాయవాదుల సమైక్య శంఖారావం సభ కోర్టు సముదాయాల సమీపంలో జరిగింది. దీనికి 13 జిల్లాల న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌బాబు సభలోనూ, అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. జాతీయ రహదారులను దిగ్బంధించాలని.. రైల్‌రోకోలు నిర్వహించాలని.. బ్యాంకులను మూసివేయాలని.. విద్యుత్ ఉత్పత్తిని స్తంభింపజేయాలని అప్పుడే కేంద్రం దిగివస్తుందని చెప్పారు. సమైక్యానికి కట్టుబడని ప్రజాప్రతినిధులు, నాయకులను సామాజికంగా బహిష్కరించాలని.. వారి ఇళ్లకు విద్యుత్, నీళ్లు కట్ చేయాలన్నారు. వారి కేసులను న్యాయవాదులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి 40 రోజుల గడువిస్తే.. దిగ్విజయ్‌సింగ్ ఇప్పుడెందుకు రాష్ట్రానికి వచ్చారని అశోక్‌బాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు నెగ్గదన్న భయంతోనే దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చారన్నారు. ప్రత్యేక సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని ముట్టడిస్తామని.. ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు.