ashokbabu
-
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి:కొడాలి నాని
-
‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’
సాక్షి, అమరావతి: దొంగ సర్టిఫికెట్తో అశోక్‌బాబు ప్రమోషన్ పొందాడని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడని మండిపడ్డారు. చదవండి: ‘అశోక్‌బాబు దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు’ అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసింది.. వైఎస్సార్సీపీ కాదని.. సాటి ఉద్యోగే అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారన్నారు. ‘‘అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గొలు పెడుతోంది. అవినీతి పరుడు కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే.. దొంగలను వెనుకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు. అశోక్‌బాబు కేసును లోకాయుక్త సీఐడీకి అప్పగించింది. ఇంటర్ చదివి.. డిగ్రీ చదివినట్టు అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సృష్టించాడు. అశోక్‌బాబు ఏం తప్పు చేశాడని చంద్రబాబు నిస్సిగ్గుగా అడుగుతున్నారు. తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసిందని’’ మంత్రి కొడాలి నాని అన్నారు. మరోసారి బిల్లు పెడతాం.. ‘‘రాజధానిపై మరోసారి బిల్లు పెడతాం. 3 రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అమరావతి, విశాఖ, కర్నూలు 3 రాజధానులుగా ఉంటాయి. వచ్చే సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లు పెడతాం. ప్రజల ఆమోదంతో 3 రాజధానులను తీర్చిదిద్దుతామని’’ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. -
‘హోదా’ ఉద్యమంలో పాల్గొనలేం: అశోక్‌బాబు
విజయవాడ: ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ఉద్యోగులుగా మద్ధతిస్తామన్నారు. రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాటం చేస్తే హోదా రాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీ వెళ్లి హోదా కోసం పోరాటం చేయాలన్నారు. హోదా హామీ ఇచ్చిన రాజకీయపార్టీలు తమ హామీని నిలబెట్టుకోవాలన్నారు. అంతకుముందు ఏపీఎన్జీఓ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఎన్జీవో అధ్యక్షుడిగా అశోక్‌బాబు ఎన్నికయ్యారు. -
అశోక్‌బాబుకు మతిభ్రమించింది
- స్వలాభం కోసమే సెక్షన్-8 జపం - హెచ్‌టీఎన్‌జీవోస్ నేత సత్యనారాయణ ధ్వజం - ఇరు రాష్ట్రాల ఉద్యోగులు సఖ్యతగా ఉన్నారని వెల్లడి కాచిగూడ: హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని, ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట సీమాంధ్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్‌బాబుకు మతిభ్రమించిందని, అందుకే అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హెచ్‌టీఎన్‌జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సత్యనారాయణగౌడ్ ధ్వజమెత్తారు. మంగళవారం నారాయణగూడలో హెచ్‌టీఎన్‌జీవోస్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి పి.బలరామ్, కేశియానాయక్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే బదులు, హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులతో తెలంగాణ ఉద్యోగులందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా, అక్కా చెల్లెళ్ల మాదిరిగా పనిచేస్తున్నామని, హైదరాబాద్ విషయాన్ని హైదరాబాద్‌లో తేల్చకుండా సీమాంధ్రలో సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనమేంటని వారు ప్రశ్నించారు. నగరంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులందరూ ఆశోక్‌బాబుకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆశోక్‌బాబు చేస్తున్న అసత్యపు ప్రకటనలు చూసి మోసపోయే స్థితిలో ఏవరూ లేరని వారు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమ సమయంలో వంద కోట్లు రూపాయలు దండుకుని అక్కడి ప్రజలకు, ఉద్యోగులకు తీరని ద్రోహం చేసి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆవే కోట్ల రూపాయలతో రాజకీయ నాయకులతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలోకి దిగి అక్కడి ఉద్యోగులను, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్వలాభాల కోసం రెచ్చగొట్టే నాయకుల వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, లేకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులు కలిసి మెలిసి జీవిస్తున్నారని తెలిపారు. ఆశోక్‌బాబు లాంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో హెచ్‌టీఎన్‌జీవోస్ నేతలు జి.మల్లారెడ్డి, ఎంఆర్ డేవిడ్‌రాజు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
17న ధర్నాకు జాతీయ పార్టీలకు ఆహ్వానం
ఢిల్లీ: ఈ నెల17న జరిగే ధర్నాకు జాతీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందదన్నారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ తిరస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం అవడం ఖాయం అన్నారు. లోక్‌సభ వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని అశోక్‌బాబు కోరారు. -
'తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారు'
ఢిల్లీ: తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. శాసనసభలో 150 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారని గట్టినమ్మకంతో చెప్పారు. ఆ తీర్మానంతో జాతీయ పార్టీ నేతలను కలుస్తామని చెప్పారు. న్యాయస్థానానికి వెళ్లే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. -
చర్చ అవసరమే లేదు
రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన తెలంగాణ బిల్లుపై చర్చ జరపాల్సిన అవసరమేలేదని పలువురు మేధావులు, విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా అన్ని పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ విభజన వద్దని కోరుతుంటే దానిపై మళ్లీ చర్చ జరపడం అవివేకమంటున్నారు. చర్చకు అంగీకరించని పార్టీలు విభజనకు అనుకూలమని ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన ప్రకటనపై అన్ని వర్గాల వారు భగ్గుమంటున్నారు. ఈ అంశంపై వివిధ వర్గాల వారు ఏమన్నారంటే. - న్యూస్‌లైన్, యూనివర్సిటీ క్యాంపస్ వైఎస్సార్ సీపీ నిర్ణయం సహేతుకం వైఎస్సార్ సీపీ సమైక్యవాదానికి కట్టుబడి తీసుకున్న నిర్ణ యం సహేతుకమైంది. విభజన బిల్లుపై చర్చ జరిగితే త ప్పనిసరిగా విభజనను అంగీకరించినట్టే. ఎన్జీవో సం ఘం నేత అశోక్‌బాబు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న రా జకీయ పార్టీలను దెబ్బతీయడానికి చేసిన ప్రకటన తప్ప మరొకటికాదు. సీఎం సమైక్యవాదం వైపు నిలిచిఉంటే విభజన బిల్లుపై సీడబ్ల్యుసీలో నిర్ణయం వెలువడిన రోజే రాజీనామా చేసి ఉండాలి. కాంగ్రెస్, టీడీపీ సమైక్యవాదం వైపు కానీ, విభజన వైపుకానీ స్పష్టమైన విధానం ప్రకటిం చలేదు. వైఎస్ఆర్ సీపీ మాత్రమే సమైక్యవాదానికి కట్టుబడి ఉంది. - భూమన్, శ్వేత మాజీ సంచాలకుడు చర్చ అనవసరం రాష్ట్రంలోని ఆరుకోట్ల మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలోని సామాన్య ప్రజలు కూ డా రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని కోరుకుంటుంటే కొందరు రాజ కీయ నాయకులు మాత్రమే ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర విభజన అంశంపై ప్రవేశ పెడుతున్న బిల్లుపైన చర్చ జరపడం అనవసరం. - స్టాన్లీ జయకుమార్, ప్రొఫెసర్, ఎస్వీయూ సమైక్యవాదమే అందరి నినాదం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర విభజన అంశంపై చర్చ జరపడం అనవసరం. ఎన్జీవో నాయకులు రాష్ట్ర విభజన అంశంపై చర్చ జరపాలని పట్టుబట్ట డం కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేయడం కోసమే. - మహ్మద్‌షఫీ, నాన్‌టీచింగ్ ఉద్యోగి, ఎస్వీయూ అశోక్‌బాబు సీఎం తొత్తు ఎన్జీవో సంఘనేత అశోక్‌బాబు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. సీఎం చేతిలో కీ లుబొమ్మలా మాట్లాడుతున్నారు. రా ష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల వారు తీ వ్రంగా ఉద్యమం చేస్తున్న సందర్భంలో సీఎం మాయమాటలు తలొగ్గి ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. - ఎం.శివాన ందరెడ్డి, ఎస్వీయూ మహానటులు మన మంత్రులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర మం త్రులు సమైక్యం కోసం పనిచేస్తున్న ట్లు గొప్పగా నటిస్తున్నారు. సినిమా వారికంటే గొప్పనటులుగా నిరూపించుకుంటున్నారు. వీరందరూ రాష్ట్ర సంక్షేమం, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడంలేదు. సీఎం పైకి సమైక్యవాదిగా నటిస్తూ విభజనకు సహకరిస్తున్నారు. ఈయనకు అశోక్‌బాబు వంత పాడుతున్నారు. - సింగం ప్రభాకర్, నాన్‌టీచింగ్ ఉద్యోగి, ఎస్వీయూ సమైక్య తీర్మానం చేయాలి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర మం త్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉంటే సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య తీర్మానం చేయాలి. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సమైక్యం కోసం తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలి. అలా చేస్తేనే విభజన ప్రక్రియ ఆగుతుంది. - ఎం.ప్రహ్లాదరెడ్డి, తిరుపతి విభజనకు ఒప్పుకున్నట్లే రాష్ట్ర విభజన అంశంపై చర్చ నిర్వహిస్తే అందరూ రాష్ట్ర విభజనకు సు ముఖంగా ఉన్నట్లే అవుతుంది. రాష్ట్ర విభజన ఏ ఒక్కరూ ఒప్పుకోనప్పుడు దానిపై చర్చ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒకవేళ తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉందని భావిస్తే దాని అభివృద్ధికి ఏం చేయాలన్న అంశాన్ని చ ర్చిస్తే సరిపోతుంది. - ఎస్వీ. సుబ్బారెడ్డి, ప్రొఫెసర్ లోతైన అధ్యయనం జరగాలి రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరూ విభజన కో రుకోవడం లేదు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు రాజ కీయ నిరుద్యోగులు ప్రత్యేక వాదంతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విభజన ప్రయత్నం చేయకుండా అసలు విభజన అవసరం ఎందుకు అన్న అంశంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. అశోక్‌బాబు ప్రకటన సమైక్యానికి కట్టుబడి ఉన్న పార్టీలను దెబ్బతీసేదిగా ఉంది. - ఎంసీ.ఓబులేశు, ఎస్వీయూ విభజన వల్ల అందరికీ నష్టం రాష్ట్ర విభజన వల్ల అన్ని వర్గాల వారికీ నష్టం వాటిల్లుతుంది. ఏ ఒక్కరూ విభజన కోరుకోవడం లేదు. విభజన జరిగితే నష్టపోతామని అన్ని వర్గాలు తీవ్రంగా విశ్వసిస్తున్నాయి. తెలుగువారందరూ ఎప్పటికీ కలసి ఉండాలి. అందరి నినాదం సమైక్యమే. విభజనతో నష్టపోతాం. - సయ్యద్ మున్నీరు మహ్మద్‌ఖాద్రి, తిరుపతి ఏకగ్రీవ తీర్మానం చేయాలి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీ ర్మానం చేయాలి. రాష్ట్ర విభజనకు కేం ద్ర ప్రభుత్వం కుట్రపన్నింది. అలాం టి కుట్రను కాంగ్రెస్ పార్టీ మంత్రు లు, సీఎం అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై చర్చ జరపడం అనవసరం. కాంగ్రెస్, టీడీపీ కలసి రాష్ట్ర విభజన కుట్ర అమలు చేస్తున్నాయి. - పేట శ్రీనివాసులురెడ్డి, మీడియా డీన్, ఎస్వీయూ అశోక్‌బాబు సమైక్యద్రోహి ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు ముఖ్యమంత్రి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. పైకి సమైక్యవాదిగా నటిస్తూ సమైక్యద్రోహం చేస్తున్నారు. ఆయన చేసిన ప్రకటన పరిశీలిస్తే సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలను దెబ్బతీసి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మేలు చేసేలా ఉంది. ఈ విషయాన్ని సీమాంధ్ర ప్రజలంతా గమ నిస్తున్నారు.- వి.హ రిప్రసాద్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ కన్వీనర్ నాటకాలు ఆడుతున్నారు రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కలిసే నాటకాలు ఆడుతున్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ఎందుకు? సీఎం ప్రజల్ని మభ్యపెట్టకుండా సభలో సమైక్య తీర్మానం చేసేలా చూడాలి. - వి.రెడ్డిశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, చిత్తూరు బిల్లుపై చర్చ అనవసరం విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానంతో పనిలేనప్పుడు, బిల్లుపై చర్చ ఎందుకు జరపాలి? ప్రజలు ఇప్పటికే ఈ విషయంలో విసిగిపోయూరు. అ సెంబ్లీలో చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యేలు తిట్టుకోవడం, అడ్డుకోవ డం చేస్తున్నారు. అలాకాకుండా సమైక్య తీర్మానం చేయా లి. లేదా ఓటింగ్ పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. - ఏఎం గిరిప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, చిత్తూరు -
నేడు రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. సమైక్యాంద్ర ఉద్యమం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అశోక్‌బాబు ప్యానల్ తరపున జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈయన కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 56 మంది ఓటర్లున్నారు. ఈ ఓట్లన్నీ అశోక్‌బాబు ప్యానల్‌కే పడే విధంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, శ్రీరాములు, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జి.రామకృష్ణారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈనెల 2వ తేదీన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి కూడా జిల్లాకు వచ్చి ప్రచారం నిర్వహించారు. అశోక్‌బాబు ప్యానల్‌పై పోటీ చేస్తున్న బషీర్ జిల్లాకు వచ్చి ప్రచారం చేయకపోయినా జిల్లాలో ఉన్న 56 మంది ఓటర్లతో మాట్లాడి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓటర్లందరూ అశోక్‌బాబు వెంట ఉంటున్నట్లు కనిపిస్తున్నా 10 నుంచి 15 ఓట్లు బషీర్ ప్యానల్‌కు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బషీర్‌కే ఓటు వేయనున్నట్లు కొందరు ‘న్యూస్‌లైన్’కు చెప్పడం ఇందుకు నిదర్శనం. అయితే జిల్లా ఓట్లు మొత్తం అశోక్‌బాబు ప్యానెల్‌కే పడతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. -
' ఉద్యమాన్ని అశోక్ బాబు కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు'
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టాడని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి రాజారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ... రాజకీయ పదవుల కోసం ఉద్యోగులను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చింది అశోక్‌బాబే అంటూ ఆయనపై రాజారెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మె అశోక్‌బాబు వల్ల బుడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం అశోక్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఉద్యమంపై ఎన్నికల ప్రభావం ఉండదు:అశోక్ బాబు
శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఉద్యమంపై ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికల ప్రభావం ఉండదని ఆ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఎన్నికల కారణంగా సమైక్య ఉద్యమం పక్కతోవ పట్టలేదన్నారు. ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికలలో ఎవరు గెలిచినా సమైక్యరాష్ట్ర ఉద్యమం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుత తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు అశోక్‌బాబు, పలువురు సభ్యులు తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు. అశోక్‌బాబు ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బషీర్ నేతృత్వంలో మరో ప్యానెల్ బరిలోకి దిగింది. మొత్తం 17 మందితో ఒక్కో ప్యానెల్ ఏర్పడింది. -
రాజకీయ జేఏసీ ఏర్పాటుకు యత్నం
పజాప్రతినిధుల ఇళ్లకు నీళ్లు, కరెంట్ కట్ సభ ముందుకు బిల్లు వస్తే అసెంబ్లీ ముట్టడి: అశోక్‌బాబు తాము రాజకీయాలకు అతీతంగా ఉన్నందున రాజకీయ జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. గురువారం విజయవాడలో న్యాయవాదుల సమైక్య శంఖారావం సభ కోర్టు సముదాయాల సమీపంలో జరిగింది. దీనికి 13 జిల్లాల న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌బాబు సభలోనూ, అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. జాతీయ రహదారులను దిగ్బంధించాలని.. రైల్‌రోకోలు నిర్వహించాలని.. బ్యాంకులను మూసివేయాలని.. విద్యుత్ ఉత్పత్తిని స్తంభింపజేయాలని అప్పుడే కేంద్రం దిగివస్తుందని చెప్పారు. సమైక్యానికి కట్టుబడని ప్రజాప్రతినిధులు, నాయకులను సామాజికంగా బహిష్కరించాలని.. వారి ఇళ్లకు విద్యుత్, నీళ్లు కట్ చేయాలన్నారు. వారి కేసులను న్యాయవాదులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి 40 రోజుల గడువిస్తే.. దిగ్విజయ్‌సింగ్ ఇప్పుడెందుకు రాష్ట్రానికి వచ్చారని అశోక్‌బాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు నెగ్గదన్న భయంతోనే దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చారన్నారు. ప్రత్యేక సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని ముట్టడిస్తామని.. ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఉద్యమ తీవ్రత పెంచుతాం: అశోక్ బాబు
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను పెంచుతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయినట్లు తెలిపారు. అసెంబ్లీ ముట్టడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద తమ బాధను వ్యక్తం చేస్తామని, నిరసన తెలుపుతామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియా గాంధీ జన్మదినాన్ని విద్రోహదినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. 4 రాష్ట్రాల్లో ఓడిపోయినా, విభజనపై కాంగ్రెస్ వెనక్కు తగ్గడంలేదన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ బిల్లులో ఎన్నో లోపాలు, అవకతవకలు ఉన్నట్లు తెలిపారు. అవసరమైతే బిల్లుపై నివేదిక రూపొందించి రాష్ట్రపతికి ఇస్తామని చెప్పారు. మొత్తం ఎంపీలంతా రాజీ నామా చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. -
' చిరంజీవికి అంత సీన్ లేదు'
ఉద్యోగులు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని చెప్పే అర్హత కేంద్రమంత్రి చిరంజీవికి లేదని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు చెప్పారు. ‘‘నియోజకవర్గం అంటూ లేని నేత చిరంజీవి. అలాంటి వ్యక్తికి మా రాజీనామాల గురించి అడిగే అర్హత ఎక్కడిది?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎన్జీవో భవన్లో ఆయన మీడియూతో వూట్లాడుతూ.. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన రెండో రోజే లక్షల మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని, అవసరమైతే చలో ఢిల్లీ, రాష్ట్ర దిగ్బంధం కార్యక్రమాలను కూడా నిర్వహించే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ నెల 7న గుంటూరులో అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. అఖిలపక్షాన్ని నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. 5న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా శిబిరాలు, డిసెంబర్ 9న తెలుగుజాతి విద్రోహ దినం పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర విభజనపై అవసరమైతే టీఆర్ఎస్ పార్టీతో కూడా భేటీ అవుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకే తాము వ్యతిరేకమైనందున రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించే ప్రసక్తే లేదని అశోక్‌బాబు చెప్పారు. -
మీరు చేసిన వెంటనే నేనూ చేస్తా : అశోక్‌బాబు
రాజీనామాపై చిరంజీవికి అశోక్‌బాబు సవాల్ సీపీఐ, సీపీఎం నేతలను కలిసిన ఏపీఎన్జీవో నేతలు సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి చిరంజీవి సహా సీమాంధ్రకు చెందిన 19 మంది ఎంపీలు రాజీనామా చేస్తే.. వారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోగా తనూ రాజీనావూ చేస్తానని ఏపీఎన్జీవోల సంఘం నేత అశోక్‌బాబు సవాల్ చేశారు. తాము రాజకీయ నాయకులం కాదని, అయినా రాష్ట్ర సమైక్యత కోసం రాజీనామాకు సిద్ధమని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు వ్యతిరేకించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సమైక్యతా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలు ఎన్జీవో సంఘాల నేతలు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, టి.వి.సత్యనారాయణ, ఎం.వెంకటేశ్వరరెడ్డి, శ్రీరాం తదితరులు ఆదివారం హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం నేతలను కలిశారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు గానీ, 2009 ఎన్నికల్లో గానీ రాష్ట్ర విభజన, యూటీ ప్రస్తావన తెచ్చి ఉంటే మిమ్మల్ని గెలిపించి ఉండేవాళ్లమే కాదు’’ అని చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చిరంజీవికి యూటీ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. మా వైఖరి మారదు: నారాయణ తెలంగాణపై తమ వైఖరి మారదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఉద్ఘాటించారు. ఎన్జీవో నేతలు తొలుత సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులను కలిసి చర్చలు జరిపారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రక్రియలో భాగంగానే తెలంగాణ వస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా రాకున్నా ప్రజాసమస్యలపై తమ పోరు ఆగదన్నారు. అశోక్‌బాబు మాట్లాడుతూ.. సీపీఐ వైఖరిని తాము ప్రశ్నించటం లేద న్నారు. బిల్లును వ్యతిరేకిస్తాం: రాఘవులు రాష్ట్ర విభజన బిల్లును తాము వ్యతిరేకిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టంచేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమను కలిసిన అనంతరం వారితో కలిసి రాఘవులు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడాల్సిందిగా ఎన్జీవో సంఘం నేతలు తమను కోరారని ఆయన చెప్పారు. ఎన్జీవోల భవిష్యత్ ఉద్యమాలకు ప్రత్యక్ష తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరారని, దీనిపై ఈ నెల ఐదో తేదీన జరిగే పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్జీవోలు నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామన్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తాం: అశోక్‌బాబు
సమ్మెలో కొనసాగుతూనే తుపాను ప్రాంతాల్లో సేవలందిస్తాం 17 నుంచి బ్యాంకుల మూసివేత.. కేంద్ర కార్యాలయాల దిగ్బంధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించేవరకూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెను తుపాన్ ముప్పు ఎదుర్కొంటున్న కోస్తాంధ్రలో తమ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే సేవలందిస్తున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 15వతేదీన మండల స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. 13వతేదీ నుంచి 15 వరకు చెన్నై వెళ్లి డీఎంకే, ఏఐడీఎంకె పార్టీల అధినేతలను కలసి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరతామన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి 19 వరకు బ్యాంకుల మూసివేత, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్భంధం చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్తు ఉండదు రాష్ట్ర విభజన వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలపై కనీస అవగాహనలేని కేంద్ర మంత్రులతో కమిటీ వేయడం, వారు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండడం తెలుగు ప్రజల దురదృష్టమని అశోక్‌బాబు పేర్కొన్నారు. మంత్రుల కమిటీ(జీవోఎం) లోపభూయిష్టంగా ఉందని, ఇరు ప్రాంతాల వారిని మోసగించేలా అది ఏర్పాటైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజలను ప్రభుత్వం మోసగిస్తుండడం ఇదే ప్రప్రథమమన్నారు. కోట్లాది మంది ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేనట్లేనని స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్తు కోరుకునే పార్టీలు విభజన నిర్ణయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, వీరేంద్రబాబు, సీవీ రమణ, రత్నకుమారి, జానకి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: అశోక్ బాబు
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించింది. ఆదివారం ఏపీఎన్జీవోలు సమావేశమై ఉద్యమం కార్యాచరణ గురించి చర్చించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కితీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రమంత్రులపై నమ్మకం పోయిందని సమావేశానంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని కేంద్రమంత్రులు వమ్ముచేశారని విమర్శించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యేల నుంచి హామీ పత్రాలను తీసుకుంటామని తెలిపారు. 8,9 తేదీల్లో కేంద్ర కార్యాలయాలను దిగ్బంధిస్తామని చెప్పారు. ఉద్యోగులపై దాడి చేసిన ఎంపీ హర్షకుమార్ కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో రాజకీయ అరాచకం జరుగుతోందని విమర్శించారు. విభజనకు నిరసనగా దసరాను జరపడం లేదని అశోక్‌బాబు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో పిలుపు వస్తేనే చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు. -
తీర్పు ఎలా ఉన్నా.. సమ్మె మరింత ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సమ్మెపై సోమవారం హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో మాట్లాడేందుకు తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబును ఏపీఎన్జీవో జిల్లా నేతలు నిలదీశారు. నేడు జేఏసీ భేటీ కీలకం: ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’లో భాగస్వామ్య సంఘాలతో కూడిన జేఏసీ సమావేశం సోమవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరగనుంది. సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ నిరవధిక సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ నిర్ణయించింది. కమిటీ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. కమిటీ చైర్మన్ సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్లు దామోదరావు, రాజేంద్రప్రసాద్, 13 జిల్లాలకు చెందిన కార్యవర్గ సభ్యులు భేటీలో పాల్గొన్నారు. సోమవారం జరగనున్న ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు: ఎన్ఎంయూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకొనే వరకు సమ్మె నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఎన్ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రకటించారు. ఎన్ఎంయూ జోనల్ కార్యదర్శులు రమణారెడ్డి, చంద్రయ్య, మోహన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న అదనపు ప్రయోజనాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీన ప్రతిపాదనపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే అశోక్‌బాబుకు చుక్కెదురు
తుని, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఎన్జీఓలు, జేఏసీ, ఇతర కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నా.. ప్రజాప్రతినిధులు మాత్రం పదవులను వీడడం లేదని ఎన్జీఓలు దుయ్యబట్టారు. శనివారం స్థానిక జీఎన్టీ రోడ్డులో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు రిలే నిరాహార దీక్షలు చేశారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు స్థానిక ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. అయితే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసిన తర్వాతే ఇక్కడకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. 38 రోజులుగా ఉద్యమం చేస్తున్న ప్రజల తరఫున ఎన్నికైన ఆయన ఎందుకు ఉద్యమంలోకి రావడం లేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలపై అభిమానం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఎమ్మెల్యే శిబిరం నుంచి నిష్ర్కమించారు. ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజాప్రతినిధులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని సమైక్యవాదులు ఆరోపించారు. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలకు తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల నాయకులు దాడిశెట్టి రాజా, నరిసే శివాజీ, పోలిశెట్టి సోమరాజు, వంగలపూడి సత్యనారాయణ, చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, సకురు నాగేంద్ర నెహ్రూ, అప్పన శ్రీరాములు తదితరులు సంఘీభావం తెలిపారు. -
సికింద్రాబాద్ లోనే మిలియన్ మార్చ్: అశోక్‌బాబు
రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచన చేయని పక్షంలో సికింద్రాబాద్ లోనే తాము మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. విభజన సమస్య రాజకీయ నాయకులకు మాత్రమే సంబంధించింది కాదని చెప్పారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీ... ఇలా అన్ని వర్గాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అత్యున్నత విద్యా అవకాశాలు ఉన్న హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటామని ఆయన అడిగారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. 50 ఏళ్లు భార్యభర్తల్లా తెలంగాణ సీమాంధ్ర కలిసి ఉన్నాయి. వారిద్దరికి పుట్టిన కొడుకే హైదరాబాద్. ప్రతిఫలం చేతికందే సమయంలో కొడుకు నా వాడే అంటే తండ్రి పరిస్థితేంటీ? అని ప్రశ్నించారు. రాష్ట్రం కలిసుండాలా? విడిపోవాలా? నిర్ణయించేది రాజకీయ నాయకులు కాదని, ప్రజలేనన్నారు. 50ఏళ్లుగా హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకొని ఇప్పుడు అర్థాంతరంగా వెళ్లమంటే ఎక్కడకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. సీడబ్లూసీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాఅభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లిన పార్టీలకు మనుగడ ఉండదనే విషయం గతంలో ఎన్నో పరిణామాలు నిరూపించాయని ఆశోక్‌బాబు వివరించారు. సమ్మె ఎంతకాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 108 రోజులు సమ్మె చేశామని గుర్తు చేశారు. తాము ఢిల్లీ వెళ్లినప్పుడు ఎంపిలను ఎన్నో రకాలుగా వేడుకున్నట్లు తెలిపారు. పదవులకు రాజీనామా చేయండి, మిమ్మల్ని మేం గెలిపించుకుంటామని చెప్పామన్నారు. మీరు రాజీనామా చేయకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని కూడా చెప్పినట్లు తెలిపారు. ప్రజల అంగీకారంలేకుండా రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని కొన్ని జాతీయ పార్టీల నేతలు చెప్పారన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. ప్రజలు ఎన్నుకొన్న నాయకులు పాలించడానికే తప్ప, విభజించడానికి కాదన్నారు. అయిదారు పార్టీల నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించలేరని పేర్కొన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ఉద్యోగులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో గొప్ప నేతలు చెప్పిన విషయాలను వక్రీకరిస్తున్నారన్నారు. ఇష్టం లేకుంటే విడిపోవచ్చంటూ కొత్త వాదన తెరమీదికి తెస్తున్నారని, ఇది నిజం కాదన్నారు. స్టేడియం లోపల ఎంత మంది ఉన్నారో బయట కూడా అంతే సంఖ్యలో ఉన్నారని చెప్పారు. తాము తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని అశోక్ బాబు స్సష్టం చేశారు. ఏడు లక్షల మంది ఉద్యోగులు ఉద్యమంలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని 50లక్షల మంది సెటిలర్లలో మూడు ప్రాంతాల వారున్నారని చెప్పారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంకంటే ఎక్కువగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు అందరిని అనుమతించాలి
ఏపీఎన్జీవోలు ఈ నెల 7న తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను నిర్వహించి తీరుతామని ఆ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సభను అడ్డుకుంటే తెలంగాణ వాదం బలహీనపడినట్లే ఆని ఆయన వ్యాఖ్యానించారు. సభకు ఉద్యోగుల కుటుంబ సభ్యులు, విద్యార్థులను అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన తెలిపారు. అయితే ఈ నెల 7వ తేదీన నగరంలోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆ రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సభను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఆ సభకు ఏపీఎన్జీవోల కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ సభకు హాజరుకాకూడదని ఓ నిబంధన విధించింది. ఆ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని ఆయన విలేకర్ల సమావేశంలో తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులను ప్రదర్శిస్తేనే బహిరంగ సభకు అనుమతిస్తామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సమ్మె విరమించేది లేదు.. ఉపసంఘంతో ప్రయోజనం లేదు
రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ ఎన్జీవో నేతలతో చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతున్న నేపథ్యంలో ఆయన 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. సమ్మెను విరమించుకోవాలనో, తాత్కాలికంగా ఆపాలనో కోరేందుకే తమను పిలిపిస్తున్నట్లు భావిస్తున్నామని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమ్మెను విరమించుకునే ప్రసక్తి లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధత లేదని మంత్రివర్గ ఉపసంఘంతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే తాము భావిస్తున్నట్లు అశోక్ బాబు చెప్పారు. ఈనెల 16వ తేదీన అన్ని ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించబోతున్నామని, ఆ తర్వత వచ్చే వారంలో ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీని కలుస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాము తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు. దాదాపు నాలుగున్నర లక్షల మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే సమ్మెలో ఉండగా, కొత్తగా ప్రభుత్వ వైద్యులు, ఇతరులు కూడా ఈ సమ్మెలోకి దిగుతున్నారు.